Lokesh-Nara-Questions-DGP-Macherla-issueపల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం సాయంత్రం వైసీపీ కార్యకర్తలు టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి, పార్టీ కార్యకర్తలపై కర్రలతో దాడులు చేసి గాయపరిచారు. ఆ తర్వాత పట్టణంలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడి చేసి ఇంటికి, అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలకి నిప్పు పెట్టారు. మాచర్లలో వైసీపీ గూండాలు ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు డిజిపికి ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేసి గాయపరిస్తే వారిని అరెస్ట్ చేయకుండా బాధితులైన టిడిపి నేత బ్రహ్మారెడ్డిని, పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం ఏమిటని చంద్రబాబు నాయుడు డీజీపీని నిలదీశారు. తక్షణం బ్రహ్మారెడ్డిని, తమ కార్యకర్తలని విడిచిపెట్టివారిపై దాడులు చేసిన వైసీపీ గూండాలని అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గూండాగిరి నానాటికీ పెరిగిపోతోందని చెప్పడానికి ఈ దాడులే నిదర్శనం. మాచర్ల ఏమైనా సొంత జాగీరని అనుకొంటున్నారా? లేకుంటే మా పార్టీ నేత బ్రహ్మారెడ్డి, కార్యకర్తలపై ఎందుకు దాడులు చేయించారు? మాచర్లలో మీ ఆగడాలని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ఉండకూడదని, నిరసనలు తెలుపకూడదనుకొంటున్నారా? అది సాధ్యం కాదని గుర్తుంచుకోండి. టిడిపి కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నాను. వీటిపై డిజిపి తక్షణం స్పందించి వైసీపీ గూండాలని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ, “రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఎంత అరాచక పాలన సాగుతోందో ఈ దాడులు అద్దం పడుతున్నాయి. మా పార్టీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేయకపోగా మా వాళ్ళనే అరెస్ట్ చేయడం చూస్తే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరి కనుసన్నలలో ఏవిదంగా పనిచేస్తోందో అర్దం అవుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు తెలపడానికి కూడా వీల్లేదా?తెలిపితే గుండాలతో దాడులు చేయిస్తారా? మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేసినవారిని పోలీసులు తక్షణం అరెస్ట్ చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.