Nara Lokesh Questions AP Govtటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో చేస్తున్న విమర్శలు, వేస్తున్న సూటి ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదు కానీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు వాటన్నిటినీ గమనిస్తున్నారు. నారా లోకేష్‌ వాదనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు బాగానే చేరుతున్నాయి.

గురువారం పాదయాత్ర చేస్తున్నప్పుడు గుంతలు పడిన రోడ్లు కనపడగా, నారా లోకేష్‌ వాటిని చూపిస్తూ ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “యువగళం పాదయాత్ర 32వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల ఆదరాభిమానాల మధ్య చాలా ఉత్సాహంగా కొనసాగింది. బందార్లపల్లెలో ఓ రోడ్డు మీద “జగనన్న గుంతల పథకం”తో ఒక సెల్ఫీ తీసుకున్నాను. గత 4 ఏళ్లుగా రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కులేదని జనం నాతో చెప్పారు,” అని ట్వీట్‌ చేశారు.

Also Read – టిడిపి పోలిటికల్ ర్యాగింగ్… మామూలుగా లేదుగా!

అనంతరం కొండేపల్లి క్రాస్ రోడ్స్ వద్ద మహిళలతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్‌ వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ వైసీపీ మాటలకి చేతలకి ఎక్కడా పొంతన లేదని చెపుతూ “శ్రీకాళహస్తిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ బీసీ మహిళ వచ్చి నాతో సెల్ఫీ దిగింది. ఆమె తన బాధని నాతో పంచుకొంది. అప్పు చేసి చిన్న ఇల్లు కట్టుకొని దానికి కరెంట్ కనెక్షన్ ఇప్పించాలని స్థానిక వైసీపీ ఎమ్మెల్యేని అడిగితే రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడట! కరెంట్ కనెక్షన్ కోసం లంచం ఎందుకు ఇవ్వాలని నేను ఆశ్చర్యపోయాను. ఆ మహిళ నాతో తన బాధ చెప్పుకొన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఆ వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆమె ఇంటిపై దాడి చేసి ఆమె జీవనాధారమైన టిఫిన్ కొట్టుని ధ్వంసం చేశారు. ఆమెకి లక్ష రూపాయలు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో దిశ చట్టముంది… హోంమంత్రిగా మహిళ ఉన్నారు. కానీ ఓ బీసీ మహిళపై వైసీపీ గూండాలే దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. హోంమంత్రి తానేటి వనిత పట్టించుకోలేదు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి దిశ చట్టం, మహిళా హోంమంత్రి ఉండి ఏం ప్రయోజనం?” అని నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

Also Read – కడప కబుర్లు: వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారట!

కానీ నారా లోకేష్‌ ప్రశ్నకి ప్రభుత్వమూ స్పందించలేదు…. ప్రతిపక్ష పార్టీ నేతలు చంద్రబాబు నాయుడుకి, పవన్‌ కళ్యాణ్‌లకి నోటీసులు పంపించే రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మావతి కూడా స్పందించలేదు.

ఓ బీసీ మహిళ తన కష్టాలని, తనకి జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నాయకులకి చెప్పుకోకూడదా? చెప్పుకొంటే ఆమెపై దాడి చేస్తారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతీ సభలో “నా అక్కలు, చెల్లెమ్మలు…” అంటూ మహిళల పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు కదా? మరి ఓ బీసీ మహిళపై సొంత పార్టీ నేత అనుచరులే దాడి చేస్తే ఎందుకు స్పందించడం లేదు?అంటే వైసీపీ నేతల మాటలకి చేతలకి తేడా ఉందనే కదా అర్దం?అనే నారా లోకేష్‌ వాదనలు ప్రజలకు ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు బాగానే చేరుతున్నాయి.

Also Read – వైనాట్ పులివెందుల?బీటెక్ రవి

నారా లోకేష్‌ విమర్శలని రాజకీయకోణంలో చూస్తూ ఆయనపై ఎదురుదాడి చేయాలనుకోకుండా ఆయన చెపుతున్న వాస్తవాలని గమనించి వైసీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకొంటే హుందాగా ఉంటుంది కదా? ఉదాహరణకి నారా లోకేష్‌ బందార్లపల్లెలో గుంతలు పడిన రోడ్లని చూపుతూ సెల్ఫీ పోస్ట్ చేశారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి గుంతలు పూడ్చి రోడ్లు మరమత్తులు చేయవచ్చు కదా? బీసీ మహిళకి ఎదురైన కష్టం గురించి మీడియాలో, సోషల్ మీడియాలోనూ వార్తలు రాగానే వైసీపీ ప్రభుత్వం స్పందించి ఆమెని వేధించినవారిపై చర్యలు తీసుకొని ఆమెకి న్యాయం చేసి ఉంటే హుందాగా ఉండేది కదా?