Nara Lokesh - Pawan Kalyanగత ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలపై పడుతుందని ఆమెను అక్కడ నుండి బరిలోకి దింపారు జగన్. అయితే ఆ పాచిక పారలేదు. విజయమ్మ ఓడిపోయారు ఉత్తరాంధ్రలో పసుపు జండా రెపరెపలాడింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు మరోసారి ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చెయ్యాలని భావిస్తున్నారట.

రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంతో పార్టీ అధినేతను అక్కడి నుంచే పోటీకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో జనసేన ఆశలన్నీ ఉభయగోదావరి జిల్లాల మీద, ఉత్తరాంధ్ర మీదే ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో ఎలాగూ సామజిక వర్గం సాయం ఉంటుంది కాబట్టి, తాను గాజువాక నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర మీద ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ కూడా ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టింది.

భీమిలి నుంచి నారా లోకేశ్‌ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కొద్దిరోజుల కిందట తెదేపా సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఉత్తరాంధ్రపై మొదటి నుంచీ తెదేపాకు గట్టి పట్టుంది. భీమిలి నుంచి పోటీ చేస్తే ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలపై ప్రభావం చూపుతుందన్న భావన ఉంది. ఈ క్రమంలో ఇద్దరు పెద్ద నాయకులు ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తే పరిస్థితిలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. చివరికి ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది అనేది ఆసక్తికరం. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో వైకాపా వ్యూహం ఎలా ఉండబోతుందో?