Nara Lokesh Padayatra Resumed After Mahanadu 2023నారా లోకేష్‌ ఇప్పటివరకు 110 రోజులలో 1423 కిమీ పాదయాత్ర చేశారు. అయితే ఈ పాదయాత్రని ఏదో మొక్కుబడిగా ఎన్నికల పాదయాత్రగా కాకుండా ప్రజాసమస్యలు తెలుసుకొంటూ, వాటి పరిష్కారాల కోసం చిత్తశుద్దితో ప్రయత్నిస్తామని శిలాఫలకాల ద్వారా హామీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్‌ తన పాదయాత్రలో గమనించిన సమస్యలకు పరిష్కారంగా మొన్న మహానాడులో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో మినీ మ్యానిఫెస్టోలో యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం చంద్రబాబు నాయుడు కొన్ని సంక్షేమ పధకాలను ప్రకటించారు.

నాలుగేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోయి, యువత తీవ్ర ఇబ్బంది పడుతోందని నారా లోకేష్‌ పాదయాత్రలో గ్రహించారు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాండర్ ప్రకటిస్తూ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మహానాడులో నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగభృతి చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. యువగళం పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారానికే అని టిడిపి మొదటి నుంచి చెపుతూనే ఉంది. మహానాడులో అది నిరూపించి చూపింది. నారా లోకేష్‌ ఏదో మొక్కుబడిగా యువగళం పాదయాత్ర చేయడం లేదనే సంగతి స్పష్టమైంది కనుక ఇకపై ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి మరింత ఆదరణ, స్పందన రావచ్చు.

రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పాల్గొనేందుకు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు నాలుగు రోజులు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ నేటి నుంచి పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 4.30 గంటలకు కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో పెద్దపసుపుల మోటు గ్రామంలో పాదయాత్ర ప్రారంభించి, సంజాముల మోటు, కన్నెలూరు క్రాస్ రోడ్స్ మీదుగా రాత్రి 9 గంటలకు శేషారెడ్డిపల్లెలో పాలకోవా సెంటర్ వద్దకు చేరుకొంటారు. ఎప్పటిలాగే దారిలో గ్రామస్తులతో ముఖాముఖీ సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. రాత్రి దేవగుడి సంకులాంబ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ సైటులో భోజనం చేసి విశ్రాంతి తీసుకొంటారు.