ఎవరైనా సినిమా కోసమని ధియేటర్ కు వెళితే… సినిమా కంటే ముందుగా ‘పొగత్రాగడం ప్రాణానికి హానికరం’ అనే ట్యాగ్ లైన్ తో కూడిన వీడియోలను వీక్షించడం సహజం. అయితే నారా లోకేష్ మాత్రం అంతకు మించిన హానికరం మరొకటి ఉందంటున్నారు… అదే జగన్ ప్రచార అస్త్రంగా భావించే ‘సాక్షి’ మీడియా. “సిగిరెట్ తాగడం కన్నా సాక్షి టీవీ చూడటం చాలా హానికరమని, అలాగే మనం సాక్షి పేపర్ కనుక చదివితే, ‘మెంటల్ బ్యాలెన్స్’ కోల్పోతామని పంచ్ లను పేల్చాడు నారా లోకేష్.
సాక్షి మీడియా అవాస్తవాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని, ఆ అవాస్తవాలను అదే పనిగా ప్రసారం చేసి, వాటిని వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తోందని తూర్పారబట్టారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తాను కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీని, అందుకే ప్రజలందరినీ కోరుతున్నాను… దయచేసి ఆ ఛానెల్ చూడొద్దు.. ఆ పేపర్ చదవద్దు… అంటూ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆ ఛానెల్, పత్రికలో వచ్చే పచ్చి అబద్ధాలు చూస్తే మన మైండ్ బ్లాక్ అవుతుందని అన్నారు చినబాబు.
తన ఆస్తులు 23 రెట్లు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని, దేశ రాజకీయాల్లో ఆరు సంవత్సరాలుగా ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక కుటుంబం తమది మాత్రమేనని, ఇది గర్వంగా చెప్తున్నానని అన్నారు. తమ కుటుంబం ఒక పధ్ధతి ప్రకారం వ్యాపారం చేస్తూ ఆస్తులు పెంచుకుంటోందని, వైఎస్సార్సీపీ అధినేతలా తనపై కేసులు లేవని, ఆయనలా తాను క్విడ్ ప్రోకో చేయలేదని, తన కారణంగా ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లలేదని జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
హెరిటేజ్ సంస్థలో తమ కుటుంబానికి 23 లక్షల షేర్లు ఉన్నాయని, ఇలా పెరగడానికి తమకు 20 ఏళ్లు పట్టిందని అన్నారు. అప్పట్లో 190 రూపాయలున్న హెరిటేజ్ షేర్, ఇప్పుడు 1000 రూపాయలు అయ్యిందని, అదే జగన్ ఆస్తులు కేవలం 12 నెలల్లోనే విపరీతంగా పెరిగిపోయాయని, తాము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామని, అందుకే పాలు, పళ్లు అమ్ముకుంటున్నామని, నీతినిజాయతీగా సంపాదించడం తన తండ్రి నేర్పించారని తెలిపారు. ఇప్పటివరకు జగన్ ఆస్తులు ప్రకటించలేదని, ఆయన ఆస్తులు ప్రకటించాలని తాను శాసనమండలిలో ఆ అంశాన్ని లేవనెత్తుతానని లోకేష్ తెలిపారు.