Nara_Lokesh_NTR_Chandrababu_TDPతెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓ దళిత ముఖ్యమంత్రికి జరిగిన అవమానం చూసిన ఎన్టీఆర్‌ అది తట్టుకోలేక 60 ఏళ్ళ వయసులో టిడిపిని స్థాపించాలని నిర్ణయించడం విశేషం.

నాడు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న టి.అంజయ్య ఏ పదవీ లేని రాజీవ్ గాంధీకి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు రాగా, ఆయన పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. ఆ ఘటనే టిడిపి ఆవిర్భావానికి బీజం వేసిందని చెప్పవచ్చు. అదే సమయంలో… తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నెత్తినపెట్టుకొని అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ పట్ల, నేతల పట్ల, ప్రజల పట్ల కాంగ్రెస్‌ అధిష్టానం చులకనభావం ప్రదర్శిస్తుండటం, ఢిల్లీలో తెలుగువారిని మద్రాసీలుగా సంభోదిస్తుండటం వంటివన్నీ చూసిన ఎన్టీఆర్‌, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం 1982, మార్చి 29న టిడిపి స్థాపించారు.

ఆ తర్వాత నుంచే అందరూ తెలుగువారిని గుర్తించడం ప్రారంభించారు. అంతేకాదు… ఎన్టీఆర్‌ హయాంలోనే దేశ రాజకీయాలను శాశించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఎన్టీఆర్‌ లక్ష్యం అంతకు మించి ఉంది. టిడిపి ఏర్పాటుకు ముందు కొన్ని అగ్రవర్ణ కులాలకు చెందిన నేతలు మాత్రమే రాజ్యాధికారం అనుభవిస్తుండేవారు. బడుగు బలహీనవర్గాల నేతలకు మంత్రి పదవులు లభించినా వారికి సముచిత ప్రాధాన్యం, గౌరవం లభించేవి కావు. అలాగే బడుగు బలహీనవర్గాల ప్రజలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించేవి.

టిడిపి రాకతో ఆ పరిస్థితి మారిపోయింది. బడుగు బలహీనవర్గాల నేతలకు రాజ్యాధికారం కల్పించడమే కాక వారికి సముచిత గౌరవం ఇస్తూ, రాజకీయంగా వారు మరింత ఎదిగేందుకు టిడిపి ఎంతగానో తోడ్పడింది. అలాగే రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలను ఎన్టీఆర్‌ అక్కున చేర్చుకొని వారి కోసం అనేక సంక్షేమ పధకాలను అమలుచేశారు. గ్రామీణ ప్రజలకు కారణం, మునసబుల ఫ్యూడల్ వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తూ ఆ వ్యవస్థను రద్దు చేసి, ప్రజాస్వామ్యబద్దమైన మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేటికీ ఆ వ్యవస్థలే నడుస్తున్నాయి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ సిఎం కేసీఆర్‌ టిడిపిని దారుణంగా దెబ్బ తీశారు. టిడిపి ఎప్పుడూ నాయకుల కంటే కార్యకర్తలనే ఎక్కువగా నమ్ముకొంటుంది. కనుక టిడిపి ముఖ్యనేతలందరూ టిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం టిడిపితోనే ఉండిపోయారు. వారి సహకారంతోనే తెలంగాణలో మళ్ళీ టిడిపి లేచి నిలబడటమే కాకుండా ఇప్పుడు కేసీఆర్‌ని సవాల్ చేయగలుగుతోంది.

ఏపీలోను టిడిపి మళ్ళీ అధికారంలోకి రాకుండా కేసీఆర్‌ అడ్డుకొని, జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడ్డారు. దాని వలన టిడిపి రాజకీయంగా నష్టపోయి ఉండవచ్చు. కానీ టిడిపి ఓటమి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భారీ మూల్యం చెల్లించవలసివస్తోంది. వైసీపీ ప్రభుత్వం కూడా టిడిపిని సమూలంగా తుడిచిపెట్టేయాలని ఈ నాలుగేళ్ళలో చేయని ప్రయత్నం లేదు. మరో పార్టీ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఉండి ఉంటే నిజంగానే కనబడకుండా పోయేది. కానీ ఈ 40 ఏళ్ళ సుదీర్గ ప్రస్థానంలో టిడిపి ఇలాంటి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చెక్కుచెదరకుండా నేటికీ బలంగా నిలిచి ఉంది. నేటికీ ఎన్టీఆర్‌ ఆశయాలు, ఆలోచనలు, విధానాలకు అనుగుణంగానే పనిచేస్తోంది కనుకనే అగ్నిపరీక్షలను తట్టుకొని ప్రజాధారణతో నిలబడగలిగిందని చెప్పవచ్చు.

వచ్చే ఎన్నికలలోగా రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకొని టిడిపి తన సత్తా, పోరాటస్పూర్తిని మరోసారి చాటుకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ సుదీర్గ ప్రస్థానాన్ని, చేసిన పోరాటాలను గుర్తుచేసుకొంటూ ఆ స్పూర్తితో రాబోయే ఎన్నికలలో విజయం సాధించి మరోసారి తమ సత్తా చాటుకొనేందుకు సిద్దం అవుతున్నారు.