గత ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకు కాంట్రాక్ట్ పుచ్చుకొన్న ఐప్యాక్ బ్యాచ్, ఓ ఎన్నికల వ్యూహం అమలుచేసింది. దానిలో భాగంగా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్‌ని దెబ్బ తీసేందుకు పప్పు, చవట, తండ్రి చాటు బిడ్డ అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు రకరకాలుగా సోషల్ మీడియాలో, బయట నియోజకవర్గంలో దుష్ప్రచారం చేయించింది. దాని వ్యూహాలు ఫలించడంతో ఎన్నికలలో వైసీపీ గెలిచింది. ఏపీ ఓడిపోయింది.
ఆ చేదు అనుభవాలనే పాఠాలుగా చేసుకొని నారా లోకేష్ చాలా నేర్చుకొన్నారని యువగళం పాదయాత్రలో బయటపడింది. అయితే గత ఎన్నికల సమయంలో తాము నారా లోకేష్ గురించి చేసిన దుష్ప్రచారం నిజమనే భ్రమలో పడిన వైసీపీ ప్రభుత్వం ఆయన పాదయాత్రను అడ్డుకోబోయింది. కానీ నాలుగైదు రోజులలోనే తాము నారా లోకేష్‌ని చాలా తక్కువ అంచనా వేశామని గ్రహించింది!
తాము ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు చిన్న ఖండన ప్రకటన చేసి ఊరుకొంటారు కానీ నారా లోకేష్ కాదనే విషయం వైసీపీకి, ముఖ్యంగా… నారా లోకేష్ దళితులను అవమానిస్తూ మాట్లాడారంటూ దుష్ప్రచారం చేసి భంగపడిన సాక్షి మీడియాకు బాగా అర్దమై ఉంటుంది.
‘దళితుల కోసం జగన్ ఏం పీకారు? ఏం పొడిచారు?’ అని నారా లోకేష్ ప్రశ్నిస్తే, ‘దళితులు ఏం పీకారు? ఏం పొడిచారు?’ అని నారా లోకేష్ అన్నట్లు సాక్షి దుష్ప్రచారం చేసింది. దానిపై నారా లోకేష్ స్పందించిన తీరు చూస్తే ఇలాంటి విషయాలలో చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్‌కి ఎంత తేడా ఉందో అర్దం చేసుకోవచ్చు.
సాక్షిలో వచ్చిన ఆ వార్తపై నారా లోకేష్ స్పందిస్తూ, “ఒకవేళ నేను దళితులను అవమానిస్తూ మాట్లాడిన్నట్లయితే ఆ సభలో దళితులు ఎందుకు చప్పట్లు కొడతారు?” అని ఒకే ఒక్క ప్రశ్నతో వైసీపీ నేతల నోళ్ళు మూతపడేలా చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు “నేను దళితులను అవమానించిన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటాను. లేకపోతే నా గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాని మూసేస్తారా?” అంటూ పదేపదే సవాళ్ళు విసిరారు. కానీ వైసీపీలో ఎవరూ వాటికి జవాబు ఇవ్వలేకపోయారు. చివరికి సాక్షి మీడియా కూడా నారా లోకేష్ సవాళ్ళకు బదులిస్తూ ఎటువంటి కధనాలు ప్రచురించలేదు.
అలాగే చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెంలో పర్యటిస్తున్నప్పుడు, మంత్రి ఆదిమూలపు సురేష్ నడిరోడ్డు మీద చొక్కా విప్పేసి సవాలు చేయడంపై చంద్రబాబు నాయుడు కాస్త సున్నితంగానే స్పందించారు. కానీ నారా లోకేష్ తనదైన శైలిలో స్పందిస్తూ, “వైసీపీలో ఒకరు చొక్కా విప్పేస్తారు… మరొకరు ఫ్యాంట్ విప్పేస్తారు… ఒక మంత్రి గంట అంటాడు… మరో మంత్రి అరగంట అంటాడు… వైసీపీలో అందరూ ఇంతేనా జగన్? నువ్వు వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేకపోతున్నావా?” అంటూ జగన్ నాయకత్వంపై అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీనే ఇరకాటంలో పెట్టారు.
నారా లోకేష్ స్పందన చూస్తుంటే వైసీపీ ఆయనను చాలా తక్కువ అంచనా వేసిందని అర్దమవుతూనే ఉంది. యువగళం పాదయాత్ర ముగిసేసరికి నారా లోకేష్ మరింత రాటుతేలుతారని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈసారి వైసీపీ-ఐప్యాక్ పప్పులు ఉడకకపోవచ్చు.