Nara Lokesh met  Doctor Sudhakar family who passed awayటీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ఈరోజు విశాఖ వెళ్లి ఇటీవలే మృతి చెందిన మత్తుమందు డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారని, సుధాకర్ మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే లోకేష్ పర్యటన పై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ విరుచుకుపడ్డారు. శవ రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు.. తండ్రిని మించిపోయాడని, ఎప్పుడు ఎవరు చనిపోతారా.. ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని తండ్రి కొడుకులు ఎదురుచూస్తారని…. చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకిలా లోకేష్ తయారయ్యారని విమర్శించారు.

అయితే దీనిపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి. “లోకేష్ చేసింది శవ రాజకీయమైతే ఓదార్పు యాత్ర పేరిట అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి చేసింది ఏమిటి? వందల కుటుంబాలను ఓదార్పు పేరిట ఓదార్చేసి రాజకీయం చేసింది ఎవరు? సహజంగా మరణించినవారిని కూడా తండ్రి ఖాతాలో వేసేసుకున్నారు కదా?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.

“ఇటీవలే శాసనసభలో కూడా నాకు ప్రాణం విలువ తెలుసు… ఎందుకంటే ఓదార్పు యాత్ర చేశా అని ముఖ్యమంత్రి చెబితే మీరంతా వెనుక ఉండి బల్లలు చరచలేదా? జగన్ చేసింది కూడా శవ రాజకీయమే అని ఒప్పుకున్నట్టేనా? చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకి జగన్ అని గుడివాడ అమర్ అన్నట్టేనా?,” అని వారు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు.