Nara Lokesh -mangalagiri elections 2024గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాలలో ఓ 3 నియోజక వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అందులో ఒకటి చంద్రబాబు నాయుడు కొడుకుగా నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం ఒకటి కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక & భీమవరంలు మరో రెండు నియోజక వర్గాలు.

ఈ మూడింటిని కైవసం చేసుకోవడంలో నాటి వైసీపీ సర్కార్ వేసిన రాజకీయ ఎత్తుగడలు సఫలీకృతం అయ్యాయి. మూడింటిలో మూడింటిని కైవసం చేసుకుని రాజకీయంగా టీడీపీ మరియు జనసేనలను వైసీపీ మానసికంగా కృంగదీసింది. ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని ఇచ్చిన నియోజక వర్గంగానే కాకుండా, ఐటీ సెక్టార్ ను మంగళగిరిలో ఏర్పాటు చేయడంతో, లోకేష్ విజయం నల్లేరు మీద నడక అవుతుందని భావించగా, ఎదురైన ఫలితం మాత్రం ముందుగా అంచనాలు వేసింది కాదు.

అనేక సర్వేలు చేయించి మరీ కొడుకుకు మంగళగిరి అప్పచెప్పిన తర్వాత కూడా లోకేష్ విజయం సాధించకపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది లోకేష్ వాక్చాతుర్యం. లోకేష్ ప్రసంగాలలో దొర్లిన తప్పులను హైలైట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీ ‘పప్పు’గా అభివర్ణించి ప్రజల్లోకి తీసుకెళ్లడం బాగా కలిసి వచ్చిన అంశం. ఒక రకంగా నాటి లోకేష్ ప్రసంగాలు తెలుగుదేశం పార్టీ వర్గాలను కూడా ఇబ్బంది పెట్టాయి.

లోకేష్ గెలవలేకపోవడానికి మరో కారణం, చంద్రబాబు తీసుకున్న చారిత్రాత్మక తప్పిద నిర్ణయం. దాదాపుగా 20 ఏళ్ళ నుండి పార్టీ గెలవని నియోజక వర్గంలో లోకేష్ ను నిలబెట్టి తన గట్స్ ఏమిటో చంద్రబాబు చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో అనేక చోట్ల అప్పటికి టిడిపి బలంగా ఉన్నప్పటికీ, చరిత్ర తిరగరాయాలన్న ఉద్దేశంతో మంగళగిరిని ఎంపిక చేసి అనేక సర్వేలు చేయించారు. కానీ చివరి ఫలితాన్ని మాత్రం అంచనా వేయలేకపోయారు.

బహుశా మంగళగిరి కాకుండా టిడిపి పట్టు ఉన్న మరో నియోజక వర్గంలో కొడుకుని నిలబెట్టినట్లయితే, లోకేష్ గెలుపు సుసాధ్యం అయ్యేది. కానీ అలా కాకుండా లోకేష్ కు కూడా తెలిసి రావాలన్న ఉద్దేశంతో మంగళగిరిని ఇచ్చారు. దాదాపుగా గెలిసినంత పని చేసారు గానీ, విజయం ముంగిట ఉన్న బోర్డర్ లైన్ ను మాత్రం దాటలేకపోయారు.

అయితే ఇదంతా గతం. మరి లోకేష్ ఓడిపోయి దాదాపుగా మూడేళ్లు కావస్తోంది. గతం నుండి పాఠాలు నేర్చుకున్నారా? ఈ సారైనా విజయం సాధిస్తారా? అంటే విజయం అనేది ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు. దాని గురించి ఇప్పుడే ప్రస్తావించడం వృధా అవుతుంది గానీ, నాటి ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని 2024లో విజయం దిశగా అడుగులు వేయడంలో మాత్రం నారా లోకేష్ విజయవంతం అయినట్లే.

మొట్టమొదటిగా నారా లోకేష్ చేస్తోన్న ప్రసంగాలే ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఒకప్పుడు ఎలా అయితే తడబడి ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారో, నేడు అలాంటి వాటికి తావు లేకుండా ఎలాంటి తడబాటుకు గురి కాకుండా ప్రత్యర్థులను ప్రజల మధ్యలో ఏకిపారేయడంలో సక్సెస్ సాధించారు. అంతే కాకుండా ప్రస్తుతం సీఎంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రసంగాలలో తప్పులను ఏకరువు పెడుతూ ప్రసంగించడం నారా లోకేష్ వంతవుతోంది.

దీంతో ఒకప్పుడు ‘పప్పు’ అన్న నోళ్లకు నేడు ‘నిప్పు’లా మారుతున్నారు. అలాగే స్థానికంగా పార్టీ బలం లేకపోవడాన్ని గమనించిన లోకేష్, ఇప్పటికే నియోజక వర్గం అంతా ఓ సారి పర్యటించి అధికార పార్టీ అలసత్వాన్ని ప్రజలకు పరిచయం చేసారు. రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయం నుండి మంగళగిరి నియోజక వర్గంలో ఉన్న రోడ్ల వరకు అనేక స్థానిక సమస్యలను ఎత్తి చూపడమే కాకుండా, తన వంతుగా కొన్ని రోడ్లను త్వరితగతిన పనులు చేయించి ప్రజలకు చేరువ అయ్యారు.

గత ఎన్నికలలో దొర్లిన తప్పులను సవరించుకున్న విధానాలే నారా లోకేష్ కు ఇపుడు కొండంత అండగా మారాయి. అలాగే అధికార పార్టీ నేత ‘కరకట్ట కమలహాసన్’గా కీర్తించే ఆర్కే నియోజక వర్గాలలో పర్యటించిన దాఖలాలు లేకపోవడం కూడా ప్రతిపక్ష పార్టీకి కలిసి వచ్చే మరో అంశం.

ఇలా అధికార పార్టీ చేస్తోన్న పొరపాట్లను ప్రజలకు అర్ధం అయ్యేలా మరింతగా చేరువ కాగలిగితే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకు చెప్పినట్లు 2024 ఎన్నికలలో తాను గెలిచి బహుమతిగా అందిస్తానని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.