Nara Lokesh letter to ys jagan about aquafarmers    తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సిఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఆక్వారైతులను ఆదుకోవాలంటూ ఈరోజు బహిరంగ లేఖ వ్రాశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50 విద్యుత్‌ అందిస్తామని చెప్పిన జగన్, యూనిట్‌పై రూ.2.36 చొప్పున పెంచేయడం ద్వారా ఆక్వా రైతులను కూడా మోసం చేసినట్లే అని లేఖలో పేర్కొన్నారు.

ఓ పక్క విద్యుత్‌ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, రొయ్యల దాణా రేట్లు పెరగగా, మరోపక్క రొయ్యల ధరలు తగ్గడంతో ఆక్వా రైతులు తీవ్రం నష్టపోతున్నారని తెలిసి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. ఆక్వా రైతులు కూడా ఆక్వా హాలీడే ప్రకటించక మునుపే ప్రభుత్వం మేల్కొని పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణం తగ్గించి వారిని ఆదుకోవాలని లేకుంటే రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం లాగే ఆక్వా రంగం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలో సూచించారు.

ఇలా రాష్ట్రంలో ఒక్కో రంగం దెబ్బతింటుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని నారా లోకేష్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజురోజుకీ సమస్యలు పేరుకుపోతున్నాయని కానీ జగన్ సర్కార్ ఎంతసేపు అప్పులు చేయడం, సంక్షేమ పధకాల డప్పు కొట్టుకొంటూ ఎన్నికల గురించి ఆలోచిస్తోంది తప్ప రాష్ట్రంలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించడంలేదని నారా లోకేష్‌ అసహనం వ్యక్తం చేశారు.