Nara Lokesh Kinjarapu Atchannaidu Nimmala Ramanaidu Rally         టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఈరోజు రాజధాని గ్రామమైన మందడం నుంచి ఎడ్లబళ్ళపై ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసనలు తెలియజేసేందుకు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. కానీ ఊహించినట్లే పోలీసులు ఆ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించి, తుళ్ళూరు వద్ద వారిని అడ్డుకొని ఎడ్లబళ్ళను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎడ్లను పోలీస్ స్టేషన్‌లో కట్టేసి, ఎడ్లబళ్ళ టైర్లలోని గాలి తీసేశారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకొన్నారు సరే.. కానీ ఎడ్ల బళ్ళు ఇచ్చిన రైతులపై దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు?ఎడ్ల బళ్ళను స్వాధీనం చేసుకోవడం ఏమిటి?ఎడ్లను కూడా అరెస్ట్ చేస్తారా?” అంటూ నిలదీశారు.

చివరికి పోలీసులు ఎడ్ల బళ్ళని విడిచిపెట్టడంతో నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు కాడిని భుజాలకెత్తుకొని బండి లాగుతూ “మోటర్లకు మీటర్లు పెడుతున్న జగన్ ప్రభుత్వం డౌన్‌ డౌన్‌…” అంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు సాగారు. కానీ మళ్ళీ వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం నారా లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ, “రైతుల సమస్యలపై నిరసన తెలుపుతున్న మమ్మల్ని పోలీసులు అడ్డుకొన్నప్పటికీ, అసెంబ్లీలో రైతుల సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము. సిఎం జగన్ ఎప్పుడూ రైతులను ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటారు. కానీ చేసే పనులు మాత్రం అందుకు పూర్తివిరుద్దంగా ఉంటాయి. రాష్ట్రంలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించేసిన జగన్మోహన్ రెడ్డి, క్రాప్ హాలీడేస్ ప్రకటించి, మోటర్లకు మీటర్లు బిగిస్తూ వ్యవసాయాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. ఇలాగే సాగితే రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మానేసే ప్రమాదం పొంచి ఉంది,” అని అన్నారు.