Nara-Lokesh-Jagan-Casesటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించి అప్పుడే 4 రోజులు గడిచిపోయాయి. సోమవారం పలమనేరు నియోజకవర్గంలో వి.కోట మండలంలో 14.6 కిమీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “జగన్మోహన్ రెడ్డి తమ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తానని, దాంతో యువతకి భారీగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని పదేపదే చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లు ఖర్చు చేస్తూ ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి వెళ్ళి పెద్దల కాళ్ళు మొక్కుతూ తమపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకొంటున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు… రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేయడం గురించి మాట్లాడటం లేదు. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ చేస్తుండటంతో ఆయనని కాపాడేందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక విమానం వేసుకొని హడావుడిగా ఢిల్లీ బయలుదేరుతున్నారు.

ఈ కేసుల కారణంగా సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావలసిన నిధులు, అభివృధ్ది పనుల గురించి మాట్లాడకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ముఖ్యంగా నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలని రప్పించడానికి గట్టిగా కృషి చేస్తుంది.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 175 ఏపీఐఐసీ క్లస్టర్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పరిశ్రమలు వచ్చేలా చేసి నిరుద్యోగ యువతకి భారీగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. అంతకంటే ముందుగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తాము. దీని కోసం ప్రతీ ఏడాది మొదట్లోనే ముందే ఉద్యోగ క్యాలండర్ కూడా విడుదల చేస్తాము. వైసీపీ ప్రభుత్వం ముస్లింలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోంది తప్ప వారి సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి గురించి అసలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం టిడిపి చేపట్టబోయే చర్యలని మ్యానిఫెస్టోలో పొందుపరుస్తాము,” అని నారా లోకేష్‌ అన్నారు.