nara lokesh into andhra pradesh cabinetఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై చంద్రబాబు దృష్టిని సారించారని వార్తలు వస్తున్న వేళ, ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేష్ కు రాష్ట్ర మంత్రి పదవి వరించవచ్చని కధనాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి లోకేష్ కు కేంద్ర మంత్రి పదవి రావచ్చని గత కొంత కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను టీడీపీ సీనియర్ నేత ఒకరు తెరదించారు.

ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అవలంభిస్తున్న వైఖరి పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, కేంద్రంలోకి పంపే బదులు రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సదరు తెలుగుదేశం నేత వెల్లడించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో లోకేష్ బెర్త్ పై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

తెలుగుదేశం కేంద్ర కమిటీలో 2015లో స్థానం లభించిన లోకేష్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడం ద్వారా, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చూపవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. లోకేష్ కు పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖను అప్పగించవచ్చని కూడా ప్రచారం జోరందుకుంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ పునర్వ్యవస్థీకరణ జరగని సంగతి తెలిసిందే. అయితే అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ కానటువంటి లోకేష్ ను ఏ హోదాలో క్యాబినెట్ లోకి తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.