nara lokesh funny comments on sakshi‘స్వామికి పూనకం రావాలంటే దరువు వేయాల్సిందే కదా’ – ‘లక్ష్మీ నరసింహా’ సినిమాలో బాలకృష్ణ చెప్పిన ఓ డైలాగ్ ఇది. ప్రస్తుతం నారా లోకేష్ తీరు కూడా ఇలాగే ఉంటోంది. ప్రెస్ మీట్ కు హాజరైతే చాలు, ముందుగా ‘సాక్షి’ మీడియా ముఖచిత్రం ఎక్కడ ఉందో అంటూ అల్లరి చేస్తున్నారు లోకేష్.

సోషల్ మీడియా పరిభాషలో చెప్పాలంటే… సాక్షిని ఓ విధంగా ర్యాగింగ్ చేస్తున్నారు. అన్ని మీడియాలకు సంబంధించిన మైక్ లన్నీ సహజంగా ఒక దాని మీద ఒకటి పెడుతుంటారు. ఇందులో ఏ ఏ మీడియా సంస్థలు ఉన్నాయని ఏ రాజకీయ నాయకుడు కూడా పెద్దగా పట్టించుకోరు.

కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానల్స్ ను అధికారికంగా బ్యాన్ చేస్తున్నామని ప్రకటన చేయడం, స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడా అనేక సందర్భాలలో నేరుగా ఈ మీడియా ఛానల్స్ పేర్లను ప్రస్తావించి మరీ విమర్శించడం జరిగింది.

దీంతో వైసీపీ ప్రత్యక్షంగా మీడియా వార్ కు తెరలేపినట్లయ్యింది. వైసీపీ ఏమో ప్రత్యర్థి మీడియా సంస్థలను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించి, ఆ మీడియా సంస్థలకు దూరంగా ఉంటుండగా, లోకేష్ మాత్రం ‘సాక్షి ఏది?’ అంటూ ప్రతి ప్రెస్ మీట్ లో అడిగి మరీ పిలుస్తున్నారు.

చిందరవందరగా ఉండే మీడియా మైక్ లను వెతుకుతూ ‘సాక్షి లేదా?’ అంటూ వ్యంగ్యంగా మాట్లాతుండడం లోకేష్ వంతవుతోంది. తాజాగా కూడా ఇలాగే అడుగుతూ… ‘సాక్షి లేదు సర్, మరో సాక్షి ఉంది టీవీ9’ అంటూ లోకేష్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ర్యాగింగ్ లు కూడా చూసాము గానీ, మరీ ఈ రేంజ్ ర్యాగింగ్ మునుపెన్నడూ చూడలేదంటూ కీర్తించడం నెటిజన్ల వంతవుతోంది. నాయకుడు అంటే ప్రత్యర్థి మీడియాలను తప్పించుకుని తిరగడం కాదు, ఇలా ధైర్యంగా ఫేస్ చేయడం అనేది టీడీపీ వర్గీయుల మాట.