Nara Lokeshటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నేడు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దారిలో యువతని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడుగారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చాము. ఈ డిక్సన్ అనే కంపెనీని కూడా అప్పుడు తెచ్చిందే. మేము అతిపెద్ద రిలయన్స్ కంపెనీని రాష్ట్రానికి తీసుకువస్తే, దానిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం పంపించేసింది. అమర్ రాజా కంపెనీని కూడా పొరుగు రాష్ట్రానికి తరిమేసింది. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తీసుకురాకపోగా ఉన్నవాటిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం బయటకి తరిమేస్తోంది.

మన ఐ‌టి మంత్రి (గుడివాడ అమర్నాథ్ రెడ్డి) కోడీ..గుడ్డూ.. కోడీ…అంటాడు ఏమిటో?ఐ‌టి మంత్రి అయితే వెళ్ళి ఐ‌టి కంపెనీలని తీసుకురావాలి కానీ మనోడు కోడీ… గుడ్డూ… కోడీ అంటూ కబుర్లు చెపుతున్నాడు. ఇలాంటివాడు ఐ‌టి మంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు ఏం తీసుకురాగలడు?” అని నారా లోకేష్‌ సూటిగా ప్రశ్నించారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి మొన్న హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలని చూసేందుకు వెళ్ళినపుడు, అక్కడ విలేఖరులు “ఏపీలో రేసింగ్ పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారని” ప్రశ్నించినప్పుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి జవాబిస్తూ “కోడి కోడిని పెట్టదు. ఇప్పుడే ఏపీలో కోడి గుడ్డు పెట్టింది… ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకి వచ్చి కోడిగా ఎదిగేందుకు కాస్త టైమ్ పడుతుంది. అప్పుడు మా విశాఖ రాజధానిలో కూడా ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు నిర్వహిస్తాము,” అని జవాబు చెప్పారు. నారా లోకేష్‌ ఇదే విషయం నేటి పాదయాత్రలో ప్రస్తావిస్తూ, “ఇలాంటివారు మంత్రులైతే ఇక రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుంది?” అని నిలదీశారు.

ఇటీవల చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “మంత్రులలో చాలా మందికి తమ శాఖలు, వాటిలో జరుగుతున్న పనుల పట్ల అవగాహన లేదు. అటువంటివారే ప్రతీరోజూ మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని విమర్శిస్తుంటారు,” అని అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారు. ఇప్పుడు నారా లోకేష్‌ కూడా చెప్తున్నారనుకోవచ్చు. అయ్యా… మంత్రిగారు విన్నారా?