Nara Lokesh Complaint on Sakshi News paperసాక్షి పత్రిక తమపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఇక ముందు సాగనివ్వకూడదని టీడీపీ భావిస్తోందట. ఈ క్రమంలో సాక్షి పత్రికపై టీడీపీ నేత నారా లోకేష్ 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. శనివారం ఉదయం విశాఖ‌ 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో లోకేష్ దావా దాఖలు చేశారు. ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో వాజ్యం దాఖ‌లైంది.

తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఉద్దేశంతో సాక్షి పత్రిక కావాలనే తప్పుడు కథనం ప్రచురించారని లోకేష్‌ పేర్కొన్నారు. 2019 అక్టోబ‌ర్ 22న సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి 25 ల‌క్షలండి’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అయితే అది నిజం కాదని లోకేష్ పలు ఆధారాలు సమర్పించారు.

ఆ బిల్లు తన ఒక్కడికే కాదని, ప్రోటోకోల్ ఉన్న ప్రముఖులు అందరికీ సంభంచిందిన బిల్లు అని లోకేష్ ఆధారాలు బయటపెట్టారు. అలాగే బిల్లు పెట్టిన కొన్ని తారీఖులలో తాను విశాఖపట్నంలో లేను అని, కొన్ని తేదీలలో అయితే ఏకంగా దేశంలోనే లేనని ఆయన రుజువులు చూపెట్టారు.

అయితే సాక్షి మాత్రం తమ పత్రికలో సంజాయిషీ ఇవ్వడం గానీ, లోకేష్ కు క్షమాపణ చెప్పడం గానీ చెయ్యలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్… సాక్షి పత్రికపై పరువునష్టం దావా దాఖలు చేశారు. ఇప్పటికైనా సాక్షి దిగొస్తుందో లేదో చూడాలి. ఈ స్టోరీని సాక్షి నుండి తీసుకుని ప్రచురించిన వేరే పత్రికలు మాత్రం తమ పొరపాటుని ఒప్పుకుని తీసి ఆ స్టోరీని తీసి వేశాయి.