Nara-Lokesh-YS-Jaganవిజయవాడలో శుక్రవారం నిర్వహించిన డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సులో పెట్టుబడులను ఆకర్షిస్తూ చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని ‘పేద రాష్ట్రం’ అని అనడాన్నిటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ ఆక్షేపించారు. ఎవరైనా మన బలాల గురించి చెప్పి పెట్టుబడులను ఆకర్షిస్తారని, తెలుగుదేశం పార్టీపై కోపంతో రాష్ట్రం ప్రగతిని చెప్పుకోకపోతే పెట్టుబడులు రావని ముఖ్యమంత్రికి హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్ గత మూడేళ్ళ కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని, ఆరోగ్య సూచిలో దేశంలో రెండో స్థానంలో ఉందని గర్వంగా చెప్పాలని లోకేష్ సూచించారు. రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ లో మొదటి 10 నగరాల్లో మూడు నగరాలకు స్థానం లభించిందని, రెండంకెల వృద్ధి సాధించిందని చెప్పాలన్నారు. రాష్ట్రంలో అపారమైన నైపుణ్య మానవ వనరులు ఉన్న యువత ఉన్నారనే విషయాన్ని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ చెప్పిందని, గత 5 ఏళ్ళలో 700 కేంద్ర అవార్డులు గెలుచుకుందని, ఇలా మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయని జగన్‌కు సూచించారు.

ఇలాంటివి కాకుండా.. మేము ఇన్ని సీట్లు గెలిచాం, అన్ని సీట్లు గెలిచాం అంటే పెట్టుబడులు రావని లోకేశ్‌ హితవు పలికారు. ఒకరకంగా లోకేష్ చెప్పిన దాంట్లో నిజం ఉందనే చెప్పుకోవాలి. పొరుగు దేశాల వారి ముందు రాష్ట్రాన్ని పలచన చేసుకోవడం మనకి గౌరవం కాదు. పేద రాష్ట్రమని చెప్పి మేము నిజాయితీగా మాట్లాడం అని చెప్పుకోవడానికి కాకపోతే పెట్టుబడులను ఆకర్షించడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యమంత్రి దీనిగురించి ఆలోచిస్తే ఆయనకే మంచిది.