nara-lokesh-comments-pawan-kalyan-jana-sena-anantapur-meetingఅనంతపురంలో జరిగిన బహిరంగ సభలో కేంద్రం తీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బొక్కలున్నాయని, వాటిని సరిచేసుకోవాల్సిందిగా ‘జనసేన’అధినేత సూచనలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అవినీతి మరకలు అంటుతున్నాయని, అవి రాకుండా చూసుకోవాలని, ఎక్కడ లోపాలు ఉన్నాయో చూసుకోండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచనలు చేసారు. అలాగే హోదా బదులు ప్యాకేజ్ ను ఎలా అంగీకరించారు. ప్యాకేజ్ లో చూపించినవన్నీ మనకు రావాల్సినవే కదా… ఇంకా కొత్తగా వాళ్ళు ఇచ్చేది ఏముంది..? అంటూ నిలదీశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు విరుచుకుపడలేదు గానీ, ఒక ఆరోపణ చేసే కన్నా, ఎక్కడ అవినీతి ఉందో పవన్ చెప్తే బాగుండేదంటూ మీడియా చర్చలలో వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్ళు నెగటివ్ గా తీసుకున్నారని భావించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. “పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ నెగటివ్ గా తీసుకోవద్దని, సానుకూలంగా తీసుకోవాలని, పవన్ ఓ బాధ్యత గల వ్యక్తిగా సలహా ఇచ్చారని, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందామని” టిడిపి నేతలకు దిశానిర్దేశం చేసారు.

అలాగే ‘హోదా’కు కాకుండా ‘ప్యాకేజ్’కు ఎందుకు ఒప్పుకున్నారని పవన్ వేసిన ప్రశ్నకు కూడా నారా లోకేష్ జవాబిచ్చారు. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాతే ‘ప్రత్యేక ప్యాకేజ్’కు అంగీకారం తెలపాల్సి వచ్చిందని, అయితే పవన్ చెప్పినట్లు దానికి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి రోజు నుండి గట్టిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా పవన్ ఎదురుదాడి చేయవద్దని గతంలో చంద్రబాబు పార్టీ నేతలకు సూచించగా, తాజాగా నారా లోకేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.