Nara Lokesh comments on jagan governmentటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బుదవారం మంగళగిరిలో టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం జగన్‌ కుప్పం అభివృద్ధికి నిధులు విడుదల చేస్తునందుకు చాలా సంతోషం. కానీ మూడేళ్ళుగా ఆయనకు కుప్పం గుర్తుకు రాలేదా?ఈ మూడేళ్ళలో ఆయన, జిల్లా మంత్రి కుప్పంకు ఏమి చేశారో చెప్పగలరా?ఎన్నికలు దగ్గర పడేవరకు ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను పట్టించుకోరా?

అయినా 175 సీట్లు గెలుస్తామని చెప్పుకొంటున్న జగన్ ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఎందుకు అంత హడావుడి పడిపోతున్నారు?తనకి చాలా ప్రజాధారణ ఉందని చెప్పుకొంటున్న జగన్‌ జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాలలో కర్ఫ్యూలు విధించి, బారికేడ్లు, పరదాలు ఎందుకు కట్టుకొని తిరుగుతున్నారు?ప్రజలు కోడిగుడ్లు, టొమోటోలు విసిరి నిరసన తెలుపుతారనే భయంతోనే కదా?అదే… చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా నిర్భయంగా వెళతారు… ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతుంటారు. ప్రజాభిమానం అంటే అదీ.

వచ్చే ఎన్నికలలో నేను మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తాను. ఒకవేళ మా పార్టీ సర్వేలో ప్రజాభిప్రాయం నాకు వ్యతిరేకంగా వస్తే పోటీ నుంచి తప్పుకొంటాను. ఓడినా, గెలిచినా ఎప్పుడూ ప్రజల మద్యే ఉండే నాయకులం మేము. ఓ ప్రతిపక్ష నేతగా మంగళగిరి నియోజకవర్గానికి, ప్రజలకు నేను చేసినన్ని పనులు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు కూడా చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఇంత చేయగలిగితే అధికారంలో ఉంటే ఇంకెంత చేయగలమో ప్రజలే ఆలోచించుకొని ఓట్లు వేస్తారని భావిస్తున్నాను.

వైసీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ మళ్ళీ ప్రతిపక్షాలను నిందించడం దూరలవాటుగా మారిపోయింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అంత అసభ్యంగా వ్యవహరిస్తున్న వీడియో బయటకు వస్తే ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోకపోగా సజ్జల రామకృష్ణారెడ్డి, మహిళా మంత్రులు కూడా ఆయననే వెనకేసుకు వస్తూ మాట్లాడటం సిగ్గు చేటు. మీ పార్టీ ఎటువంటిదో ప్రజలకు అర్దమవుతోంది. ఆ వీడియో నకిలీదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఏవిదంగా చెప్పారు?ఆయన ఏమైనా ఫోరెన్సిక్ నిపుణుడా?లేదా ఫోరెన్సిక్ నిపుణులు ఆయనకు ఫోన్‌ చేసి చెప్పారా?

అది నాలుగు గోడల మద్య జరిగిన ప్రైవేట్ వ్యవహారమని మీ సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా దృవీకరిస్తున్నారు కదా?మరి టిడిపిని ఎందుకు నిందిస్తున్నారు?గోరంట్ల వీడియో ప్రైవేట్ వ్యవహారంగా భావిస్తున్నారు కనుక మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ రాసలీలలు కూడా ప్రైవేట్ వ్యవహారాలేనని రేపు సజ్జల సర్టిఫికేట్ జారీ చేస్తారేమో?

వైసీపీ నేతలు ఈవిదంగా తప్పుడు పనులు చేస్తూ నా గురించి, నా తల్లి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇటీవల మా కుటుంబంలో విషాదం జరిగితే అప్పుడూ విజయసాయి రెడ్డి తప్పుడు కూతలు కూశారు. వైసీపీ నేతల తీరు చూసి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు,” అని నారా లోకేష్‌ అన్నారు.