TDP_Nara_Lokesh_YSRCPటిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో 19వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, బీసీ సంక్షేమంపై మంత్రులు చేస్తున్న వాదనలపై ఘాటుగా స్పందించారు. “బీసీ సంక్షేమంపై దమ్ముంటే చర్చకి రావాలని నన్ను పిలిచారు. మీరు సిద్దమైతే నేను సిద్దమే. సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను పాదయాత్రలో ఉన్నాను. ఈ పవిత్రమైన ఈ పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదు. కనుక రాబోయే మూడు రోజులలో నా పాదయాత్ర షెడ్యూల్ మీకు పంపిస్తాను. దారిలో ఎక్కడైనా ప్రజల ఎదుటే మీ ప్రభుత్వం బీసీలకి ఏమి చేసిందో… గతంలో మా ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఏమి చేసిందో చర్చిద్దాము. మీకు దమ్ముంటే రండి. మీలాగా ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టి సవాళ్ళు విసరడం లేదు. నేను పాదయాత్ర చేస్తూ ప్రజల మద్యనే ఉన్నాను. దమ్ముంటే రండి చర్చిద్దాం… ఎస్సీ, బీసీలని మీ ప్రభుత్వం ఎంతగా మోసం చేసిందో నేను బయటపెడతాను. బడుగు బలహీనవర్గాల ప్రజలని మీ జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేస్తున్నారో నేను చెపుతాను. దమ్ముందా… రండి చర్చకి…”అంటూ నారా లోకేష్‌ వైసీపీ మంత్రులకి సవాల్ విసిరారు.

తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో నివశిస్తున్న రాణి అనే అంధురాలిని గంజాయి మత్తులో ఓ వ్యక్తి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశాడు. ఆ విషాద ఘటనపై నారా లోకేష్‌ స్పందిస్తూ, “తాడేపల్లిలో మీ కొంపకి కూతవేటు దూరంలో రాణి అనే అంధురాలిని అతికిరాతకంగా హత్య చేస్తే, నువ్వు ఆమె కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇచ్చి పంపించేశావు. ఓ అంధురాలి జీవితం విలువ 10 లక్షలని వెలగడతావా?జగన్ రెడ్డీ… నేను ఇరవై లక్షలు ఇస్తాను… చనిపోయిన ఆ రాణిని బ్రతికించి తేగలవా అని అడుగుతున్నాను. నీ పాలనలో మహిళలలకి ఇంట్లో ఉన్న భద్రత లేకుండాపోయిందేమిటయ్యా?” అంటూ నారా లోకేష్‌ నిలదీశారు.