Nara Lokesh Challenges YS Jaganటిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ శుక్రవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 15వ రోజు యువగళం పాదయాత్ర చేశారు. రేణుకాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టే ముందు అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. దారిలో ఎగువ కమ్మకండ్రిలో చెరుకు, బెల్లం రైతులతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కనెక్షన్ కావాలంటే లక్షన్నర కట్టాలని డిమాండ్‌ చేస్తున్నారని సుధాకర్ అనే చెరుకు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటూ రైతులని ఈవిదంగా ఎందుకు పీడిస్తున్నారని నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత కాపుకండ్రికలో బలిజకాపు యువత, విద్యార్థులతో నారా లోకేష్‌ మాట్లాడిన్నప్పుడు తమకి ప్రభుత్వం ప్రకటిస్తున్న విద్యా పధకాలు అందడం లేదని ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా అక్కడి యువత నారా లోకేష్‌ ఆరోగ్యం గురించి ప్రశ్నించడం విశేషం. దానికి నారా లోకేష్‌ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకొంది. “దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీసుల వల్ల నా ఆరోగ్యం బాగానే ఉంది. నా ఆరోగ్యాన్ని బాగానే కాపాడుకొంటున్నాను. ఆ రోజు ఇంటి గడప దాటుతున్నప్పుడే చెప్పాను… 400 రోజులు పాదయాత్ర ముగించే వరకు తిరిగి ఇంటికి రానని! రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తిరిగి ఇంటికి వెళ్ళను,” అని అన్నారు.

నారా లోకేష్‌ చాలా సుకుమారుడని కనుక ఎక్కువ రోజులు పాదయాత్ర చేయలేరని వైసీపీ నేతలు, చివరికి రాంగోపాల్ వర్మ కూడా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వారి అంచనాలని తలక్రిందులు చేస్తూ నారా లోకేష్‌ అప్పుడే 15 రోజులు పాదయాత్ర పూర్తి చేసి నేడు 16వ రోజు ప్రారంభించారు కూడా. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే మొదలుపెట్టిన ఈ పాదయాత్రని మద్యలో ఆపబోనని నారా లోకేష్‌ వారికి చాలా స్పష్టంగానే చెప్పారనుకోవచ్చు.

పాదయాత్రలో భాగంగా శుక్రవారం చిత్తూరు-పుత్తూరు ప్రధాన రహదారిపై వెళుతున్నప్పుడు పెనుమూరు మండలంలో కమ్మరాయగుట్ట (కొండ)ని చూశారు. విశాఖలో ఋషికొండని తవ్వేసిన్నట్లే దానినీ వైసీపీ నాయకులు కంకరరాళ్ళ కోసం తవ్వేసుకొంటూ కొండకి గుండు కొట్టేశారని ట్వీట్‌ చేశారు. ఈ వైసీపీ మాఫియాని అడ్డుకోకపోతే రాష్ట్రంలో కొండలన్నీ కనిపించకుండా మింగేస్తారంటూ కమ్మరాయగుట్ట ఫోటోని జోడిస్తూ నారా లోకేష్‌ట్వీట్‌ చేశారు.

దానిపై నగరి నియోజకవర్గం నుంచి మరో వ్యక్తి స్పందిస్తూ, తమ ప్రాంతంలోగల కొండలని కూడా ఇలాగే తవ్వేస్తున్నారని, దయచేసి స్పందించాలంటూ ఆ కొండల ఫోటోలతో రీట్వీట్ చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ, ఆ కొండలని తవ్వేస్తున్నట్లు నారా లోకేష్‌ చూసి ప్రజలకి తెలియజేశారు కనుక వైసీపీ ప్రభుత్వం వాటిపై కూడా గ్రీన్ మ్యాట్స్ కప్పేసి దాచిపెట్టేస్తుందేమో?అని వ్యంగ్యంగా రీట్వీట్‌ చేశారు.

యువగళం, జనవాణి డైరీలో కూడా నారా లోకేష్‌ దీని గురించి ప్రస్తావిస్తూ, పచ్చటి పొలాలు, సెలయేర్లతో ప్రకృతి అందాల నడుమ గల కమ్మరాయగుట్టని వైసీపీ భకాసురల కన్నుపడటంతో కళావిహీనంగా మారింది. వైసీపీ అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా కొండని తవ్వేస్తూ ప్రభుత్వ ఖజానాకి సుమారు రూ.250 కోట్లు నష్టం కలిగించారని డైరీలో పేర్కొన్నారు. ఆవు చేలో మెస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు జగన్‌ విశాఖలో ఋషికొండని తవ్వేస్తుంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఇలా అడ్డుగోలుగా కొండలు తవ్వేసుకొంటున్నారని నారా లోకేష్‌ పేర్కొన్నారు.