nara-lokesh-mahanaduమహానాడు మూడవ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ప్రసంగం మొదలైంది. కిక్కిరిసిన కార్యకర్తలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన లోకేష్, తాత ఎన్టీఆర్ ను, తండ్రి చంద్రబాబునాయుడుల శైలిని అనుకరిస్తూ మొదలుపెట్టారు. “నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. తిరుపతికి – తెలుగుదేశం పార్టీకి ఎక్కడలేని అనుబంధం ఉంది.

“సరిగ్గా ఇదే రోజు… 1982లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఈ ప్రాంతం నుండే ప్రచారం మొదలు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో రాజకీయ ప్రభంజనం సృష్టించారు. ఇలాంటి పుణ్యభూమిలో, అదే రోజు మే 29వ తేదీ నాడు నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా” అంటూ ప్రసగించారు లోకేష్.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ‘దొంగబ్బాయ్’ గా అభివర్ణించిన లోకేష్… ఈ రోజు మనం చూస్తున్నాం… ప్రతిపక్ష నేత దొంగబ్బాయ్ గారున్నారు… ఆయన పదే పదే మన మ్యానిఫెస్టో చూపిస్తారు… చూపించి, మనమిచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదంటారు. ఈ సభా ముఖంగా దొంగబ్బాయ్ గారిని ఒకటే అడుగుతున్నాను. అయ్యా! 25 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు రుణమాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ అవునా? కాదా? అని అడుగుతున్నాను. అదే విధంగా 10 వేల కోట్లు ఖర్చు పెట్టి డ్వాక్రా మహిళలకు చేయూతగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అవునా? కాదా? అని నేను అడుగుతున్నా… అంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో 24 గంటల కరెంటు ఇచ్చింది కూడా మనమే. మూడు నెలల్లో ఎక్కడా చూడని విధంగా ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లను వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గంట కాదు… దాదాపు మూడు రోజులు పడుతుంది మన నాయకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్న మన ముఖ్యమంత్రి, ఆరు నెలల పాటు అమరావతికి వచ్చినప్పుడెల్లా బస్సులోనే తిని, బస్సులోనే పడుకుని, బస్సులోనే నిద్రించారని గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తానని, తన తండ్రి చంద్రబాబు నాయుడుకు చెడ్డపేరు తీసుకువచ్చే పనులు చేయబోనని యువనేత నారా లోకేష్ వాగ్దానం చేశారు. తనపై వైకాపా నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే ఒక్క ఆరోపణనైనా నిరూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కావాలనే టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సీట్లు దక్కకపోయినా, టీఆర్ఎస్ తరువాత తెలుగుదేశం పార్టీకే అత్యధిక ఓట్ల శాతం వచ్చిందని, టీడీపీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.

జగన్ కు మాదిరిగా తన తండ్రి తలదించుకునే పనులు చేయబోనని, ఒక్కసారి అవినీతికి పాల్పడినట్టు రుజువైనా స్వయంగా జైల్లోకి వెళ్లి కూర్చుటానని సంచలన వ్యాఖ్యలు చేసారు. కుట్రా రాజకీయాల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, విపక్షాలు వేసే వలలో చిక్కుకోవద్దని కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి కోరారు.