Nara Lokesh Arrestఅమరావతిలో రాజధాని తరలింపుపై రైతులు చేస్తున్న పోరాటం 21వ రోజుకు చేరింది. రైతులతో పాటు టీడీపీ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కొద్దిసేపటి క్రితమే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా.. కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాస్తారోకో వైపు వెళ్తున్నాడని.. అందుకే ఆయన్ను అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

పార్టీ ఆఫీసుకి వెళ్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని లోకేష్‌ వెంట ఉన్న అనుచరులు మండిపడుతున్నారు. లోకేష్‌తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తోట్ల వల్లూర్ పోలీస్ స్టేషన్, వుయ్యూర్ సర్కిల్ కు వారిని తరలించారు. టీడీపీ నాయకుల అరెస్టు మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, రైతుకూలీలకు మద్దతు చెప్పేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం అని అన్నారు. అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలి. అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.