Nara-Lokesh-Gets-Coveted-Invitation-from-WEFనందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాక స్థానికంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ తన తరపున ఒక పీఏని పెట్టుకున్నారు. నియోజకవర్గంతో టచ్ లో ఉండటానికి చేసిన ఈ ఏర్పాటు తరువాతి కాలంలో బెడిసి కొట్టింది. ఆ పీఏ తన ఇష్టారాజ్యం వ్యవహరించి బాలయ్యకు బ్యాడ్ నేమ్ తెచ్చాడు. నియోజకవర్గ కార్యకర్తలకు, లీడర్లకు బాలయ్యకు మధ్య దూరం పెంచేశాడు. ఆ తరువాత బాలయ్య ఇంకో పీఏని పెట్టుకోవడంతో పరిస్థితి కొంత మెరుగు పడింది.

ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో పోటీ చెయ్యనుండడంతో అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. శుక్రవారం ఆయన తాను పోటీచేసే నియోజకవర్గం మంగళగిరిలో ప్రచారం మొదలు పెట్టారు. నా వద్ద పీఏ వ్యవస్థ ఉండదు.. కార్యకర్తలు, ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు లోకేష్. అందరి ఫోన్‌ కాల్స్‌కు, మెసేజ్‌లకు తాను సమాధానం ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దీనితో బాలయ్య చేసిన తప్పు లోకేష్ చెయ్యడని తేలింది.

మంగళగిరిలో పోటీ అంటే లోకేష్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టే. 1983లో టీడీపీ ఆవిర్భావం నుండి ఈ సీటును కేవలం రెండు సార్లే ఆ పార్టీ గెలిచింది. 1989 తరువాత అయితే ఇక్కడ నుండి టీడీపీ గెలిచింది లేదు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి కేవలం 12 ఓట్లతో ఓడిపోయారు. కాకపోతే అమరావతి రాజధానిగా ప్రకటించాక మంగళగిరిలో అభివృద్ధి బాగా జరిగింది. దాని మీద ధీమాతోనే లోకేష్ ఇక్కడ నుండి పోటీ చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నారు.