Nara -Lokesh ముందస్తుకు వెళ్లాలని యోచిస్తున్న ప్రధాని మోడీ వ్యూహాలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలకు ఏకంగా ఏడెనిమిది నెలల ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బాబు భావించడం లేదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్న తరుణంలో తన అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకుని వాటిని పరుగులు పెట్టించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు.

తాజాగా మంగళవారం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ తమకు ఐదేళ్ల కాలానికి ప్రజలు అధికారం అప్పగించారని, ముందస్తుకు వెళ్లే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. నిజానికి లోక్‌సభ, ఏపీ శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ 18 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్లొచ్చని చట్టం చెబుతోంది. అంటే డిసెంబరు 18 తర్వాత ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. ఒకవేళ అంతకంటే ముందే వెళ్లాలంటే మాత్రం చంద్రబాబు నిర్ణయం అవసరం అవుతుంది.

శాసనసభను ప్రభుత్వం రద్దు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధి సాధ్యం కాదు. కాబట్టి ఏపీలో జమిలి ఎన్నికలు దాదాపు అసాధ్యం. తొలుత డిసెంబరులోనే ముందస్తుకు వెళ్లాలని కేంద్రం భావించింది. అయితే తాజాగా అక్టోబరులో నిర్వహించాలని యోచిస్తోంది. మరోవైపు డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 20 మధ్య రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వాలి. అంటే దానికి కనీసం రెండు నెలల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలి.

అయితే లోక్‌సభను ముందుగానే రద్దు చేసి ఈ రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, తమిళనాడు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలనేది బీజేపీ వ్యూహం. అలా జరగాలంటే ఆయా రాష్ట్రాల్లో బలమైన కారణమో, అసాధారణ పరిస్థితులో ఉండాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాల అంగీకారం అవసరం. మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ, మోడీకి బద్ధ శత్రువుగా తయారైన చంద్రబాబు అందుకు అంగీకరించకపోవచ్చు. సో… ఏపీ ఎన్నికలు నిర్ణీత సమయం ప్రకారమే జరిగే అవకాశం ఉంది.