Nara-Chandrababu-Naidu-TDPటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరి జోలికీ పోరు. కానీ తనపై అనుచితంగా విమర్శలు చేస్తున్నవారిని కూడా ఉపేక్షిస్తూ రాజకీయంగా నష్టపోయిన సందర్భాలు అనేకం. అందుకే నారా లోకేష్‌ ‘నేను బాబుగారిలా కాదు… దెబ్బకు దెబ్బ తీస్తా… అదే మన పద్దతి,’ అని బహిరంగంగానే హెచ్చరిస్తుంటారు. అందుకే నారా లోకేష్‌పై వైసీపీ నేతల విమర్శలు తగ్గాయి కానీ చంద్రబాబు నాయుడుపై తగ్గడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడప్పుడు చురకలు వేస్తూనే ఉంటారు కానీ చాలా హుందాగా నోరు జారకుండా!

తాజాగా టిడిపి మ్యానిఫెస్టో ఓ బిసిబిలా బాత్, పులిహోర అంటూ ఇటీవల జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “ఆయనో మేధావి. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ యూనివర్సిటీలో చదువుకొన్నారు. కానీ అదెక్కడుందో ఎవరికీ తెలీదు. అక్రమాస్తుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న గొప్ప ఆర్ధికవేత్త. జైలుకి వెళ్ళి వచ్చిన గొప్ప సంఘసంస్కర్త. సొంత బాబాయ్‌ని గొడ్డలితో లేపేయడం కూడా వాటిలో ఒకటి.

ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తారు. సభలో గంటల తరబడి ఉపన్యాసాలు చేస్తూ పిట్టకధలు, పురాణాలు, నీతులు చెపుతుంటారు. రెండువేల నోట్లు రద్దు చేయాలనే ఆలోచన మీకే ఎందుకు వచ్చిందని జగన్‌ అడిగాడు. ఆ రెండువేల నోట్లు ప్రింట్ చేసి దొంగిలించడం మాత్రమే నీకు తెలుసు కనుక అలాంటి ఆలోచనలు నీకు రావు. కానీ టిడిపికి ముందుచూపు ఉంది. సమాజం పట్ల బాధ్యత ఉంది. అందుకే వాటిని ప్రవేశపెడుతునప్పుడే వద్దని వారించాము. రద్దు చేయాలని కోరాము.

మేము కర్ణాటకలో రెండు పార్టీల మ్యానిఫెస్టోని కాపీ కొట్టి మా మ్యానిఫెస్టో తయారుచేశామంటూ దానిని ‘బిసిబిల్లా బాత్’ అంటూ చక్కటి పోలిక కూడా చెప్పారు. బిసిబిల్లా బాత్‌ చాలా పౌష్టికాహారమని ఆ స్క్రిప్ట్ రాసిచ్చినవాడికి బహుశః తెలిసి ఉండదు. తెలీదేమో ఏదో వెరైటీగా ఉంటుందని రాసిస్తే జగన్‌ దానినే గొప్పగా చదివేశాడు. టిడిపి మ్యానిఫెస్టోని ఆ పౌషికాహారంతో పోల్చడం ద్వారా మా మ్యానిఫెస్టో ఏపీకి చాలా మంచిదని జగన్‌ స్వయంగా ఒప్పుకొన్నారు. వైసీపీది పులిహోరవంటి మ్యానిఫెస్టో అని ఆయన నోటితోనే చెప్పుకొన్నాడు. పులిహోర మంచి రంగుతో నోటికి రుచిగా ఉంటుంది. అది కడుపు నింపుకోవడానికి తప్ప బిసిబిల్లా బాత్‌లాగా బలవర్ధకం కాదు.

పులిహోర వైసీపీ మ్యానిఫెస్టో రాష్ట్రానికి పనికిరాదని బిసిబిల్లా బాత్‌ వంటి టిడిపి మ్యానిఫెస్టోయే మంచిదని పాపం ఆయన నోటితోనే చెప్పుకొన్నారు. తనకు తెలియకుండానే టిడిపిని మెచ్చుకొన్నామని జగన్‌ గ్రహిస్తే, ఆ స్క్రిప్ట్ రాసిచ్చినవాడి పనైపోతుంది,” అని చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా అన్నారు.