Nara_Chandrababu_Naidu_TDPమాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిని అర్దరాత్రి పూట రహస్యంగా కూల్చేవేసేందుకు ప్రయత్నించడంపై మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డి భూకబ్జాల గురించి ప్రశ్నించారు. “ఇడుపులపాయలో జగన్ కుటుంబం దళిత కుటుంబాలకు చెందిన 600 ఎకరాలు కబ్జా చేసింది. అయ్యన్న పాత్రుడి ఇంటిని కూల్చేందుకు అత్యుత్సాహం చూపిన రెవెన్యూ, పోలీస్ అధికారులకు సిఎం జగన్‌ భూకబ్జాపై చర్యలు తీసుకొనే ధైర్యం ఉందా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కారణంగానే అయ్యన్న పాత్రుడు వంటి బీసీ నేతలపై సిఎం జగన్మోహన్ రెడ్డి కక్షకట్టి ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తూ టిడిపి నేతలను, కార్యకర్తలను వేదిస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులందరూ భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అయ్యన్న పాత్రుడి ఇల్లు కూల్చివేతపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.

“జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం పెరిగిపోతున్నందునే ఈవిదంగా టిడిపి నేతలను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ మూడేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి మా నేతలను, కార్యకర్తలను ఎంతగా వేదిస్తున్నా అందరూ ఎదురుతిరిగి పోరాడుతూనే ఉన్నారు తప్ప ఎవరూ భయపడి తోక ముడిచి పారిపోలేదనే సంగతి జగన్, వైసీపీ నేతలు ఇంకా గ్రహించలేదు. ఇప్పుడూ అలాగే ఎదురొడ్డి పోరాడుతాము. జగన్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నెలదీసి ప్రశ్నిస్తూనే ఉంటాము,” అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.