Chandrababu-Naidu-and-Jagan PRC“ఛలో విజయవాడ” కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్న ఉద్యోగులు ముఖ్యమంత్రిగా జగన్ తీరుపై వివిధ రూపాలలో తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు అమలు చేసిన పీఆర్సీని, ప్రస్తుతం జగన్ అమలు చేసిన పీఆర్సీని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నెత్తి మీద ఉన్న జుట్టు ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఇది చంద్రబాబు ఇచ్చిన పీఆర్సీ అని, అలాగే తన గుండును చూపిస్తూ జగన్ ఇచ్చిన పీఆర్సీ అని చెప్పిన వీడియో హిలేరియస్ గా మారింది. చంద్రబాబు ఇచ్చిన పీఆర్సీలో ఫిట్ మెంట్, డీఏలు అన్ని కలిపి ఇచ్చిన పీఆర్సీ అని, ఇప్పుడు ఫిట్ మెంట్ కోసేసి, హెచ్ఆర్ఏ కోసేసి ఇచ్చిన పీఆర్సీ అని ఓ ఉద్యోగి వివరణ ఇచ్చారు.

అలాగే శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చిన సీపీఎస్ సంఘ నేత మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైందని, మేము జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ని అడగలేదే, ముఖ్యమంత్రుల భూములు అడగలేదే, హింస పెడుతున్నారు మా ఉద్యోగుల్ని, మీకు 151 సీట్లు వచ్చాయంటే అది ఉద్యోగుల భిక్ష అన్న విషయం పెట్టుకోమని తీవ్రంగా స్పందించారు.

అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండీ మాకు సమాధానం చెప్పడానికి, జగన్ మోహన్ రెడ్డి ముందుకు రావాలి, రాజ్యాంగ పదవుల్లో ఉన్న మంత్రులు సమాధానం చెప్పకుండా సజ్జల సమాధానం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మిమ్మల్ని అధికారంలో నుండి దింపడానికి రాష్ట్రమంతా తిరుగుతామని తీవ్రంగా హెచ్చరించారు.