Nara_Chandrababu_Naiduచిత్తూరు మాజీ మేయర్, నగర టిడిపి అధ్యక్షురాలు కఠారి హేమలత కాళ్లపై నుంచి టూటౌన్ సీఐ యతీంద్ర జీపు నడిపించడంపై మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మాజీ మేయర్ దంపతుల హంతకులను పట్టుకోలేని పోలీసులు ఆ కేసులో సాక్ష్యం చెపుతున్నవారిని వేధించడం, వారి ఇంట్లో గంజాయి బస్తా పెట్టి తప్పుడు కేసులు బనాయించాలని ప్రయత్నించడం చాలా దారుణం. అంతకంటే దారుణం కఠారి హేమలత కాళ్ళపై నుంచి జీపుని నడిపించడం. ఆ సీఐకి ఇంత కండకావరమా?ఎవరి అండ చూసుకొని అతను ఇంతగా రెచ్చిపోతున్నాడు?మేము అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న ఇటువంటి వారందరి సంగతీ చూస్తాను. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో పోలీసులు సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల దయాదాక్షిణ్యాల కోసం ఇంతగా వెంపర్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. చిత్తూరులో జరిగిన ఈ ఘటనపై కోర్టులో కేసు వేసి సదరు పోలీసు అధికారిని, వారి వెనుక ఉన్న వైసీపీ నాయకులని అందరినీ కోర్టుకీడుస్తాము,” అని హెచ్చరించారు.

హేమలతకు వైద్యులు ఎక్స్‌రే తీసి రెండు కాళ్ళ ఎముకలలో స్వల్పంగా పగుళ్ళు వచ్చాయని తెలిపారు. అందుకు అవసరమైన చికిత్స చేసి ఇంటికి పంపించారు. మాజీ మేయర్ అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసును నీరు గార్చేందుకే పోలీసులు సాక్షులను ఈవిదంగా అక్రమకేసులలో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.