Nara_Chandrababu_Naidu_MLC_Elections2023మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలుచుకోవడాన్ని చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో విశ్లేషించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు డా.అంబేడ్కర్ నేను నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాని. దాంతో పోరాడి రాజులే అవుతారో, అమూల్యమైన ఆ ఓటును అమ్ముకొని బానిసలవుతారో… నిర్ణయం మీ చేతుల్లోనే ఉందన్నారు. ఆయన సూచించిన ప్రకారమే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో విధ్వంస పాలన చేస్తున్న జగన్‌ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పారు.

నిజానికి ఈ ప్రజాతీర్పును ప్రజలలో వచ్చిన మార్పుగా కాక వైసీపీ పాలనకు, దాని విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికలలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలు, అరాచాలకు పాల్పడినప్పటినప్పటికీ, ఎంతగా అధికార దుర్వినియోగం చేసినప్పటికీ, ఓటర్లు ఏమాత్రం భయపడకుండా టిడిపికి ఓట్లు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

మీ మంత్రులే ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని, విశాఖ రాజధానిపై రిఫరెండం, వైసీపీ ఓడిపోతే ఉత్తరాంద్ర ఓడిపోయినట్లే అంటూ చాలా చాలా మాట్లాడారు కదా? కానీ ఉత్తరాంద్ర ప్రజలు ఛీ కొట్టారు. మరిప్పుడేమంటారు?న్యాయరాజధాని అని సీమ ప్రజలని, విశాఖ రాజధాని అని ఉత్తరాంద్ర ప్రజలని మభ్యపెట్టాలనుకొన్నారు. త్వరలో విశాఖకి తరలివచ్చేస్తానని పారిశ్రామికవేత్తలకు నమ్మబలికారు. రాష్ట్రానికి 13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని నిరుద్యోగ యువతను మోసం చేయాలని ప్రయత్నించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా తిరిగి వారు దాచుకొన్న డబ్బు వాడేసుకొని మోసం చేశారు. అందుకే మీ పాలన, విధానాలు, అనాలోచిత నిర్ణయాల పట్ల విసుగెత్తిపోయిన ప్రజలు ఈ సెమీ ఫైనల్స్ ఎన్నికలలో టిడిపిని గెలిపించి మార్పు కోరుకొంటున్నామని స్పష్టంగా చెప్పారు.

గాలికి వచ్చిన పార్టీ గాలికే కొట్టుకుపోవడం ఖాయం. కనుక అధికారులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయండి కానీ జగన్‌ అరాచకంలో భాగస్వాములు కావద్దు. ఒకవేళ అయితే ఏమవుతుందో గతంలో జైలుకి వెళ్ళిన అధికారులను అడిగితే చెపుతారు. దేశంలో మరే నాయకుడు చేయనివిదంగా పారిశ్రామికవేత్తలను, ఐఏఎస్ అధికారులను తనతో జైలుకు తీసుకువెళ్లిన ఘనత జగన్‌ది. కనుక ఆయన ఆరాచాకాలలో భాగస్వాములై భవిష్యత్‌లో ఇబ్బందులు పడవద్దని సూచిస్తున్నాను.

ఈ ఎన్నికలలో వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మేము ఎంతో పోరాటం చేయవలసి వచ్చింది. ఎన్ని చేసినా ఓటమి ఖాయం అని తెలిసి చివరికి కౌంటింగ్ కేంద్రాలలో అధికారులను, పోలీస్ అధికారులను బెదిరించి భయపెట్టి ఎన్నికల ఫలితాలు తారుమారు చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించారు. కానీ ఎంత అరాచకం చేసినా చివరికి టిడిపి అభ్యర్ధి రామగోపాల్ రెడ్డే గెలిచారు కదా?అదీ… పశ్చిమ రాయలసీమలోని మీ పులివెందులతో సహా మూడు జిల్లాల ప్రజల ఓట్లతో! మీ పాలనకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెపుతావు జగన్‌ రెడ్డీ?ఇప్పటికైనా ఓటమిని అంగీకరిస్తావా లేదా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.