Nara-Chandrababu-Naidu-Khammam-Public-Meetingతెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న హైటెక్ సిటీ, ఐ‌టి కంపెనీలు, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలను టిడిపి హయాంలోనే వచ్చాయి. అలాగే ఎస్ఎల్‌బీసీ, ఎస్ఆర్‌ఎస్‌పీ, దుమ్ముగూడెం, భీమా, నెట్టెంపాడు తదితర సాగునీటి ప్రాజెక్టులు టిడిపి హయాంలోనే నిర్మించబడ్డాయి. ఎన్టీఆర్‌ హయాంలో పలు సంక్షేమ పధకాలు అమలుచేశారు. బడుగు బలహీనవర్గాల ప్రజలకు రాజ్యాధికారం కల్పించారు. కనుక తెలంగాణ ప్రజలని ఓట్లు అడిగే హక్కు టిడిపికి ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఖమ్మంలో జరిగిన టిడిపి శంఖారావం సభలో చెప్పారు. నాలుగేళ్ళ తర్వాత తొలిసారిగా తెలంగాణలో జరిగిన టిడిపి సభకి వేలాదిగా జనాలు తరలివచ్చారు. తెలంగాణలో టిడిపి ఎక్కడుందని ప్రశ్నించేవారికి ఈ సభకు వచ్చిన జనాలే జవాబు అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ సభకి తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, నన్నూరి నర్సిరెడ్డి, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ కూరపాటి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంబంపాటి రామ్మోహన్ రావు, బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్‌ గౌడ్, నందమూరి సుహాసిని, కాట్రగడ్డ ప్రసూన్, జ్యోత్స్న తదితరులు హాజరయ్యారు.

చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ నిన్న సాయంత్రం ఖమ్మం జిల్లా కేశవాపురంలో ప్రవేశించినప్పుడు వందలాదిగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనకి ఘనస్వాగతం పలికారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత చంద్రబాబు నాయుడు వారితో కలిసి ర్యాలీగా ఖమ్మంలోని సభావేదిక సర్దార్ పటేల్ స్టేడియం చేరుకొన్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన వేలాదిమంది ప్రజలు, పార్టీ కార్యకర్తల హర్షద్వానాలు చేస్తుండగా చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహంగా ప్రసంగించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసే అవకాశం లేదని, కానీ ఏపీలో కొందరు బుద్ధిలేనివాళ్ళు మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో టిడిపి నుంచి కొందరు ముఖ్యనేతలు వివిద కారణాలతో ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయినప్పటికీ పార్టీ కార్యకర్తల కారణంగానే నేటికీ తెలంగాణలో ఇంత బలంగా ఉందన్నారు. రాష్ట్రంలో మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకొందామని అన్నారు. ఈ సభకి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలలో నుంచే నాయకులను తయారుచేసుకొందామన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్ళినవారు కూడా తిరిగి రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సభలో మాట్లాడుతూ, “ఇదే స్పూర్తితో తర్వాత నిజామాబాద్‌లో ఆ తర్వాత వరుసగా అన్ని జిల్లాలలో టిడిపి సభలు నిర్వహించుకొందాము. చివరిగా హైదరాబాద్‌లో భారీ బహిరంగసభతో రాష్ట్రంలో మన శక్తి సామార్ద్యాలను చాటి చెపుదాం,” అని అన్నారు.