Chandrababu_Naidu_on_Jallayya_murderపల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో శుక్రవారం కంచర్ల జల్లయ్య (38) అనే ఓ టిడిపి కార్యకర్తని వారి ప్రత్యర్ధి వర్గం బందించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి అతికిరాతకంగా కత్తులు గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు.

అమరావతిలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారు. ఇపుడు మా పార్టీకి చెందిన ఓ బీసీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను కత్తులు, గొడ్డళ్ళతో దాడి చేసి అతికిరాతకంగా హత్యచేస్తే పోలీసులు ఏమి చేస్తున్నారు?

పల్నాడులో మా పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైసీపీ నుంచి ప్రమాదం ఉందని తెలిసినా పోలీసులు ఎందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? మాచర్లలో జరుగుతున్న ఈ బీసీల హత్యల వెనుక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హస్తం ఉంది కనుకనే జల్లయ్య హత్య జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు హంతకులను అరెస్ట్ చేయలేదు. తక్షణం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి హంతకులను, వారి వెనుక ఉన్నవారిని హాజరుపరిచి అందరికీ ఉరిశిక్షలు విధించినప్పుడే మళ్ళీ ఇటువంటి దారుణాలు జరుగవు.

జల్లయ్య ప్రాణాలు కాపాడలేక పోయిన పోలీసులు అతని అంత్యక్రియలకు వెళ్తున్న మా పార్టీ నేతలను ఎందుకు అడ్డుకొంటున్నారు?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జల్లయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి పట్టిపాటి పుల్లారావు రూ.25 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.

రాష్ట్రంలో మరెవరైనా చనిపోయినప్పుడు లేదా మహిళలు అత్యాచారానికి గురైనపుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోటీలు పడి మరీ దాని గురించి మాట్లాడుతారు. ప్రభుత్వం వెంటనే ఆర్ధికసాయం ప్రకటిస్తుంది. మంత్రులో ఎమ్మెల్యేలో స్వయంగా వెళ్ళి వారి కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేసి వస్తారు.

కానీ కంచర్ల జల్లయ్య టిడిపికి చెందిన కార్యకర్త కనుక ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. అతను టిడిపి కార్యకర్తే అయినప్పటికీ రాష్ట్రంలో ఓ పౌరుడే కదా? బీసీ వర్గానికి చెందిన ఓ నిరుపేద వ్యక్తే కదా?బీసీలపై తమకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకొనే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జల్లయ్య దారుణ హత్యను కనీసం ఖండించలేదు ఎందుకు?

వైసీపీకి ఎంతసేపు రాష్ట్రంలో బడుగుబలహీనవర్గాలకు సంక్షేమ పధకాలు పంచిపెట్టి వారి ఓట్లు దండుకోవాలనే యావే తప్ప వారు కూడా మనుషులే..వారికి సమాజంలో గౌరవమర్యాదలు, కుటుంబాలు ఉంటాయి. కనుక వారిని, వారి హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉందని భావిస్తే ఇటువంటి హత్యలు జరిగేవే కావు. వైసీపీ నేతలు ఈవిదంగా ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యేవారే కారు.