Nara Chandrababu-Naidu- Telugu Desam Partyటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు బయలుదేరుతానని ప్రకటించగానే వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఓ పక్క నారా లోకేశ్‌, మరో పక్క చంద్రబాబు నాయుడు, వారి వెనుకే బాదుడే బాదుడు అంటూ వాయించేస్తున్న తెలుగు తమ్ముళ్ళు అందరినీ ఎలా తట్టుకోవాలో అని కంగారూ పడుతున్నారు.

చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు బయలుదేరుతానని చెప్పడమే కాదు…వెంటనే ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరిపోయారు కూడా.

ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోని దాళ్ళవలస, కండ్యామ్ గ్రామాలలో టిడిపి అధ్యర్యంలో జరుగనున్న ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

రేపు అంటే మే 5వ తేదీన భీమిలి నియోజకవర్గంలో తాళ్లవలస గ్రామంలో, మర్నాడు ముమ్మిడివరం గ్రామంలో జరిగే ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

ఇప్పటికే గత మూడు వారాలుగా టిడిపి నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతూనే ఉండటంతో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.

ఇప్పుడు స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే రంగంలో దిగి నిరసన కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తుండటంతో టిడిపి శ్రేణులు సమరోత్సాహంతో ఊగిపోతున్నాయి.

టిడిపిని దెబ్బ మీద దెబ్బ తీసి మళ్ళీ కోలుకోకుండా చేశామని సంతోషపడుతున్న వైసీపీ నేతలు, ఇంత హటాత్తుగా వేగంగా టిడిపి పుంజుకొని తమ ప్రభుత్వంతో, పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ పోరాటానికి సిద్దం అవడం చూసి దిగ్బ్రంతి చెందుతున్నారు.

ఇప్పటికే ‘బాదుడే బాదుడు’ అంటూ తమ ప్రభుత్వాన్ని తెగ బాదేస్తున్న టిడిపి శ్రేణులను ఎదుర్కోవడమే కష్టంగా ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారికి తోడవడంతో టిడిపిని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తలలు పట్టుకొంటున్నారు. చంద్రబాబు నాయుడు రాకతో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందో అని వైసీపీ తీవ్ర ఆందోళన చెందుతోంది.