ntr-nannaku-prematho-updatesజూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 25వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన “నాన్నకు ప్రేమతో” సినిమా షూటింగ్ కు చిత్ర యూనిట్ ‘గుమ్మడికాయ’ కొట్టింది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాగైనా అనుకున్న తేదీ (13)కి విడుదల చేయడానికి చిత్రయూనిట్ అహర్నిశలు శ్రమిస్తోంది. సోషల్ మీడియాలో లభ్యమవుతున్న సమాచారం మేరకు… ఈ సినిమా నిడివి 3 గంటల పైగా వచ్చిందని, దీనిని ఎడిట్ చేయడం సాంకేతిక నిపుణులకు తలకు మించిన భారంగా ఉందని ప్రచారం జరుగుతోంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన “1 నేనొక్కడినే” సినిమా నిడివి కూడా దాదాపు 3 గంటలకు చేరువ కావడంతో, సినిమాలోని మూడు పాటల్ని సగం వరకే పరిమితం చేయడంతో పాటు, సినిమా విడుదలైన తర్వాత క్లైమాక్స్ లో 10 నిముషాల నిడివి తగ్గించడం వంటి తదితర విషయాలు సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయాలే. దీంతో సినిమా నిడివి విషయంలో జరుగుతున్న ప్రచారానికి ‘బుడ్డోడు’ అభిమానులు కాస్తంత కలత చెందుతున్నారు. సెన్సార్ పూర్తయితే అధికారికంగా సమాచారం లభిస్తుంది గనుక, అప్పటివరకు వేచిచూడడమే అభిమానుల వంతు!

ఇక, తొలిసారిగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో డబ్బింగ్ చెబుతోంది. ఈమె చెప్పిన డబ్బింగ్ సినిమాకు దోహదపడుతుందని టాక్. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయితే ఈ వారంలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తవనున్నాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో “నాన్నకు ప్రేమతో” మినహా మిగతా చిత్రాల సెన్సార్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. ‘ఎక్స్ ప్రెస్ రాజా(క్లీన్ యు), సోగ్గాడే చిన్నినాయనా(యు/ఎ)’ చిత్రాలు ఇప్పటికే పూర్తి చేసుకోగా, ‘డిక్టేటర్’ సెన్సార్ 6వ తేదీన జరుపుకోనుంది. దీంతో సెన్సార్ పరంగానూ “నాన్నకు ప్రేమతో” సినిమాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరి ఎప్పటికి విజయవంతంగా అన్ని హంగులు పూర్తవుతాయోనని జూనియర్ ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.