nannaku prematho divide talk‘క్రియేటివ్’ అన్న పదానికి ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారుతున్నటువంటి సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 25వ చిత్రంగా విడుదలైన “నాన్నకు ప్రేమతో” సినిమా పట్ల ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా భిన్న స్పందనలను వ్యక్తం చేసారు. కొందరు ‘కేక’ అంటుంటే, మరికొందరు ‘బాబోయ్ భరించలేం’ అంటున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే… కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు… ఇంటెలిజెంట్ మైండ్ గేమ్ తో నడిచిన “నాన్నకు ప్రేమతో” అనే ఓ అతి సాధారణ కధ ప్రేక్షకులకు రీచ్ కాకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి.

ముందుగా, దర్శకుడి సుకుమార్ ప్రతిభను ప్రామాణికంగా చేసుకుని ఈ సినిమాకు వెళ్ళేవారిని “నాన్నకు ప్రేమతో” ఆకట్టుకుంటుందేమో గానీ, మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఊహించుకుని ఎన్నో ఆశలతో సినిమాకు వెళితే… ధియేటర్లో దర్శనమిచ్చే ‘క్లాస్’ జూనియర్ నిరుత్సాహపరుస్తాడు.

ఇక, సినిమా పరంగా చూసుకుంటే… హీరో – విలన్ల మధ్య మైండ్ గేమ్ ఉన్నట్లయితే తెలుగు ప్రేక్షకుల ఆలోచనల రీత్యా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేది. కానీ, ‘ఆపరేషన్ జీరో’ కోసం ఎంపిక చేసే మనుషుల నుండి హీరోయిన్ వరకు దాదాపుగా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు సుకుమార్ ‘మైండ్ గేమ్’తో నింపేయడం వలన రొటీన్ తెలుగు ప్రేక్షకులు ఈ సీన్లను భరించడం కష్టసాధ్యంగా మారింది.

ఈ సినిమాలో వచ్చే డైలాగ్స్ అన్ని సందర్భోచితంగా వచ్చేవే. అయితే, హీరో పాత్ర చెబుతున్న డైలాగ్స్ ను అర్ధం చేసుకునే పాటికి మరో డైలాగ్ వచ్చేస్తుండడంతో… ఒకానొక స్థాయిలో ప్రేక్షకుల మతి పోతుంది. బి, సి సెంటర్లలో అయితే ఫస్టాఫ్ లోనే ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హీరోయిన్ తో జూనియర్ పలికే డైలాగ్స్ అర్ధం కావాలంటే… టైం పాస్ కోసం వచ్చే ప్రేక్షకుల వల్ల కాని పని.

సుకుమార్ రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ను బహుశా హీరోతో పాటు చిత్ర యూనిట్ అంతా చాలా సార్లు విని ఉంటారు. అంత క్లిష్టమైన ‘మైండ్ గేమ్’లను ప్రేక్షకులు కొద్ది సెకన్లలో అర్ధం చేసుకోవడం కష్టమే. అలాగే యంగ్ టైగర్ మేకోవర్ సినిమా సన్నివేశాలలో బాగానే ఉంది గానీ, ఆ గడ్డంతో ఎన్టీఆర్ డ్యాన్స్ లు చేస్తుంటే మాత్రం వీక్షించడం ఇబ్బందికరంగానే ఉంటోంది.

ఇక, అన్నింటి కంటే ప్రధానమైన కారణం… తెలుగు ప్రేక్షకుల ఆలోచనా తీరు. మన ప్రేక్షకులకు సినిమా అనేది ఒక వినోదం. అలాంటి వినోదాన్ని “ఎవరు” అందించినా ఆదరిస్తారు. ‘ఎవరు’ అనేది గుర్తు పెట్టుకోండి… తర్వాత మాట్లాడుకుందాం..! మన తెలుగు ప్రేక్షకులలో ఎక్కువ శాతం మంది ఆశించే వినోదం “నాన్నకు ప్రేమతో” సినిమాలో ఖచ్చితంగా లేదు. హాలీవుడ్ సినిమాల స్క్రీన్ ప్లే మాదిరి రూపుదిద్దుకోవడంతో… ఈ సినిమా అర్ధం కావాలంటే ప్రతి సన్నివేశాన్ని తీక్షణంగా చూడాల్సిందే. సెల్ ఫోన్ మ్రోగిందనో లేక రెస్ట్ రూమ్ కు వెళ్లి వద్దామనుకుంటే… సన్నివేశాలలో ‘లింక్’ మిస్సయినట్లే. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం మరో సీన్ తో ముడిపడి ఉంటుంది గనుక!

ఇందకా ఏదో చెప్తూ… ఆ… ‘ఎవరు’ అన్న దానిపై కదా… మన ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తే తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్… ఇలా భాషాబేధంతో సంబంధం లేకుండా… డబ్బింగ్ సినిమా అయినా సరే ధియేటర్లకు క్యూ కడతారు. బహుశా ఇదే సినిమా ఏ తమిళ సినీ పరిశ్రమ నుండి వచ్చిందనుకో… ఏ మాత్రం అంచనాలు ఉండవు గనుక ఫలితం వేరేలా ఉండేదేమో! ఒక్కసారి ఆలోచించండి..!