Nani Vishwak Sen Kiran Abbavaramఅభిరుచులు మారాయి ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని మనం అనుకోవడమే కానీ మెజారిటీ ఆడియన్స్ లో ఉన్న మాస్ ప్రేక్షకులే థియేటర్లకు ఆదాయ వనరులు. వీళ్ళ దీవెనలు లేనిదే ఏ హీరో స్టార్ కాలేడు. ఎన్ని క్లాసిక్స్ లో నటించినా ఎన్నో ఫీల్ గుడ్ మూవీస్ చేసినా ఫైనల్ గా మార్కెట్ విస్తరించాలంటే మాత్రం కమర్షియా సూత్రాలకు లోబడాల్సిందే. కమల్ హాసన్ అంతటి గొప్ప యాక్టర్ శుభసంకల్పంలో చేసిన హృద్యమైన నటన కన్నా భారతీయడులో అదిరేటి డ్రెస్సు మేమేస్తే అంటూ వేసిన స్టెప్పులకే జనం ఫిదా అయ్యారు. అఫ్కోర్స్ సేనాపతిగా ఆయన పెర్ఫార్మన్స్ ని తక్కువ చేయడానికి లేదనుకోండి.

ఇప్పుడు పెద్దా చిన్నా తేడా లేకుండా అందరూ మాస్ మంత్రం పఠిస్తున్నారు. నాని దసరా ఫీవర్ అప్పుడే కమ్మేసుకుంటోంది. గతంలో న్యాచురల్ స్టార్ కొత్త రిలీజులు వచ్చినప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి భారీ సపోర్ట్ దక్కేది. మాస్ ట్రై చేద్దామని జెండాపై కపిరాజు, కృష్ణార్జున యుద్ధం, వి లాంటివి చేసిన నానికి అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో చూపించే రా విలేజ్ డ్రామాలకు మంచి ఆదరణ దక్కుతోంది. పుష్ప విజయం కన్నా ఉదాహరణ అక్కర్లేదు. దసరా కనక బ్లాక్ బస్టర్ కొడితే ప్యాన్ ఇండియాలో ఇమేజ్ ఏర్పడుతుంది.

ఫలక్ నుమా దాస్ నుంచి విశ్వక్ సేన్ కుదిరినప్పుడంతా మాస్ ని లక్ష్యంగా పెట్టుకుంటూనే వచ్చాడు. కొంచెం సాఫ్ట్ గా కనిపించిన అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడాకు సోసోగానే స్పందన వచ్చింది. అందుకే మళ్ళీ రూటు మార్చి దాస్ కా ధమ్కీతో స్వీయ దర్శకత్వంలో ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో భారీ పారితోషికమిచ్చి స్క్రిప్ట్ రాయించి మరీ తెరకెక్కించాడు. దసరా కన్నా వారం ముందే ఇది రానుంది. ఇంకా ఎదిగే స్టేజిలో ఉన్న కిరణ్ అబ్బవరం మీటర్ లో గబ్బర్ సింగ్ పోలీస్ ఆఫీసర్ గా ఏదో డిఫరెంట్ గానే ప్రయత్నించాడు. ఎంతవరకు వర్కౌట్ అయ్యిందో సినిమా చూస్తే కానీ చెప్పలేం.

వీళ్ళే కాదు నితిన్ చేస్తున్న వక్కంతం వంశీ మూవీలోనూ ఇలాంటి ఊర మాస్ సెటప్పే ఉంది. బాక్సాఫీస్ వద్ద నెగ్గుకురావాలంటే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి బడా స్టార్లకే కాదు మీడియం నుంచి చిన్న తరహా కదా అందరికీ ఆ వర్గం మద్దతు అవసరమవుతోంది. వీటికి క్లాసు మాసు తేడా లేకుండా అందరి సపోర్ట్ ఉంటుంది కాబట్టి వీలైనంత బలంగా అలాంటి కథలనే ఏరికోరి మరీ చేస్తున్నారు. రామ్ కు ఇస్మార్ట్ శంకర్ చేసిన మేజిక్ తిరుమల కిషోర్, లింగుస్వామిలు చేయలేకపోయారు. అందుకే ఈసారి ఏకంగా బోయపాటి శీనుతో జట్టు కట్టేశాడు. మాస్ కున్న పవర్ ఇది. ఇంకో యాభై ఏళ్ళ తర్వాత కూడా చెక్కుచెదరదు.