Nani Pawan Kalyanసినీ పరిశ్రమకు, రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. రాజకీయ నాయకులు సినిమాలు తీస్తుంటారు. సినీ నటీనటులు రాజకీయాలలోకి ప్రవేశిస్తుంటారు. కనుక ఒక దాని ప్రభావం మరో దానిపై తప్పక ఉంటుంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో అనారోగ్యకర వాతావరణం ఏర్పడటం వలన సినీ పరిశ్రమపై ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది.

ఉదాహరణకు ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి బస్టాండ్ వద్ద టిడిపి కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహించాబోతే దానిని మున్సిపల్ సిబ్బంది అడ్డుకొన్నారు. ఒకవేళ ఆయన కేవలం సినిమాలకే పరిమితమైయ్యుంటే ఈవిధంగా చేసి ఉండేవారు కాదని అందరికీ తెలుసు. కానీ ఆయన హిందూపురం టిడిపి ఎమ్మెల్యే కూడా. కనుకనే ఈవిధంగా జరిగిందని వేరే చెప్పక్కరలేదు.

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన పార్టీ ద్వారా ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు కనుక ఆయనకు, ఆయన నటించిన సినిమాలకు కూడా ఏపీలో రాజకీయంగా సమస్యలు ఎదుర్కోక తప్పడం లేదు. ఆయనకే సినిమాలకే కాదు… అయనతో సంబంధం ఉన్నవారి సినిమాలకు కూడా ఇబ్బంది తప్పడం లేదు.

నాచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా ఈరోజు విడుదలైంది. నిన్న ఆ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినిమాలు వేరు రాజకీయాలు వేరు. ఆ స్పష్టత నాకు ఉంది. సినీ పరిశ్రమలో భిన్న రాజకీయ దృక్పధాలు కలిగినవారున్నారు. అయితే సినిమాల విషయానికి వచ్చేసరికి మనం అందరం ఒక్కటే అనే భావనతో ఉండాలి. ఈ సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు. మన అందరిదీ. కనుక ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకోవాలి. మన సినిమాలు బాగా ఆడాలని కోరుకోవడం సహజం. కానీ ఇతరుల సినిమాలు ఆడకూడదని కోరుకోకూడదు. అది చాలా దుర్మార్గమైన ఆలోచన అని నేను భావిస్తున్నాను,” అంటూ నాని నటన, వ్యక్తిత్వాన్ని పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసించారు.

పవన్‌ కళ్యాణ్‌ పేరు చెపితేనే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైఎస్సార్ కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అందరూ మండిపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ ఛార్జీలు తగ్గించినందుకు నాని కూడా తప్పుపడుతూ మాట్లాడారు. కనుక నానిపై కూడా వైసీపీ నేతలు గుర్రుగానే ఉన్నారు.

ఇప్పుడు నాని సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని, రాజకీయాల కోసం సినిమాలను బలి చేయవద్దన్నట్లు మాట్లాడటంతో బహుశః ఇంకా గుర్రుగా ఉండవచ్చు. కానీ పవన్‌ కళ్యాణ్‌ చెప్పింది వాస్తవమే అని అందరికే తెలుసు. కనుక ‘అంటే సుందరానికి’ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ఉంటే ప్రజలు కూడా సంతోషిస్తారు.