Dasara Teaserమన తెలుగు హీరోలందరూ మాస్ ఫీవర్ లో ఊగిపోతున్నారు. జనాన్ని థియేటర్లకు రప్పించాలంటే క్లాస్ కథలు, రొమాంటిక్ స్టోరీలతో పని జరగదని గుర్తించి సూటు బూటు వదిలేసి పంచె బీడీ పట్టుకుంటున్నారు. తాజాగా దసరా టీజర్ చూశాక ఇంతకీ ఇందులో నిజంగా నానినే హీరోనా అన్నంత రేంజ్ లో ఊర మాస్ అవతారంలో చూపించేశారు. ఈ ట్రెండ్ రంగస్థలంతో మొదలైన మాట వాస్తవమే కానీ పీక్స్ కు తీసుకెళ్లింది మాత్రం పుష్పనే. రెండింటి దర్శకుఢు సుకుమారేనన్న సంగతి మర్చిపోకూడదు. నిజానికి మాస్ అంటే ఏదో పల్లెటూరి జనమో చదువు తక్కువగా ఉన్నోవాళ్ళో కాదు. అధిక శాతం మెజారిటీ ఒక వర్గంగా ఏకగ్రీవంగా ఆదరించడం దానర్థం.

ఇటీవలే వచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి సగం సినిమాకు పైగా లుంగీలోనే ఉంటాడు. వీరసింహారెడ్డిలో పెద్ద బాలయ్య విశ్వరూపం చూపించేది నల్లని పంచతో చుట్ట వెలిగించుకుని. సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబు ఓ పాటకోసం ఈ గెటప్ వేస్తే దానికే రిపీట్ విజిల్స్ పడ్డాయి. అయితే ఇదంతా ఇప్పుడు వచ్చిన ట్రెండ్ కాదు. అలనాటి ఎన్టీఆర్ కాలం నుంచే ఉంది. మగాడు, నేరం నాది కాదు ఆకలిది, వేటగాడు లాంటి కమర్షియల్ చిత్రాల్లో ఆయన వేషభాషలు అందరినీ ఊపేశాయి. సూపర్ స్టార్ కృష్ణకు కిరాయి కోటిగాడు, ఊరికి మొనగాడు వగైరాలు తెచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కృష్ణంరాజు కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీల సంగతి సరేసరి.

ఏదో ఒక సినిమాలో ఏదో ఒక సందర్భంలో చిన్నా పెద్ద తేడా లేకుండా హీరోలందరూ ఈ ఫార్ములాని వాడుతున్న వాళ్లే. అందులోనూ సుకుమార్ పరిచయం చేసిన రా పీరియాడిక్ డ్రామా ఒక వైరస్ లాగా పాకిపోయింది. ఓ పల్లెటూరి సెటప్, సహజంగా కనిపించే క్యారెక్టర్లు, 80 లేదా 90ల కాలంలో జరిగినట్టు నడిపించే స్టోరీ ఇవి చాలు. ఇటీవలే వచ్చిన శాండల్ వుడ్ సెన్సేషన్ కాంతారలో ఎంత డివోషనల్ టచ్ ఉన్నా రిషబ్ శెట్టి క్లైమాక్స్ ముందు వరకు ఏ రూపంలో ఉంటాడో చూశాం. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ బ్లాక్ ముందు పోలీస్ డ్రెస్ వదిలేసి పంచె కట్టుకుని వచ్చి రావు రమేష్ బార్ ని బాంబులతో లేపేస్తేనే అభిమానులకు అసలైన కిక్ వచ్చింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ ఎక్స్ పరి డేట్ లేని ఒక డ్రగ్ లాంటిది ఈ మాస్ హిస్టీరియా. సరిగ్గా సరైన డోస్ లో వేసుకుంటేనే జనానికి ఎక్కేసి బ్లాక్ బస్టర్ ఇస్తుంది. ఏ మాత్రం ఎక్కువ తక్కువైనా తేడా కొట్టేసి ఆసుపత్రి బెడ్డు ఎక్కిస్తుంది. దసరా కావొచ్చు రేపు మరొకటి కావొచ్చు అందరి లక్ష్యం ఒకటే. సిటీ నుంచి చిన్న పట్టణాలు గ్రామాల దాకా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకోవాలంటే మాస్ మంత్రం ఒకటే దివ్యౌషధంలా కనిపిస్తోంది. ఇది అవసరం లేకుండానే బ్లాక్ బస్టర్లు కొట్టొచ్చని విక్రమ్, కెజిఎఫ్ లు నిరూపించాయి కానీ ఎంతైనా పంచెకట్టు బీడీ కొట్టు తర్వాతే ఇవన్నీ. అందుకే దశాబ్దాలు గడుస్తున్నా ఇది ఫేడౌట్ కావడం లేదు.