సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన “తిమ్మరుసు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైన నాచురల్ స్టార్ నాని, సినిమా ఇండస్ట్రీ పడుతోన్న ఇబ్బందులను, టికెట్ ధరల నిర్ణయంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఎవరూ నోరు మెదపక పోవడంతో, నాని పేరు మీడియా మొత్తం చుట్టేసింది.
అంతలా ప్రకంపనలు సృష్టించిన నాని స్పీచ్, తర్వాత ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయడం… ఇలా తన వంతుగా చేయాల్సిందంతా చేసారు. ఫలితాలు ఎలా ఉన్నా, మొదటిసారిగా ఒక హీరో గళం విప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైనం ప్రశంసలను పొందింది.
మళ్ళీ అదే సత్యదేవ్ హీరోగా “స్కై ల్యాబ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైన నాచురల్ స్టార్, టికెట్ ధరలపై ఛలోక్తులు విసిరారు. ఒక విధంగా చెప్పాలంటే, త్వరలో రిలీజ్ కు సిద్ధమైన పెద్ద హీరోలు ఈ విషయంపై మాట్లాడతారో లేదోనని చెక్ పెట్టారు నాని.
“సత్య, కంగారు పడకు నేను సినిమా టికెట్ల రేట్ల గురించి ఇక్కడ ఏం మాట్లాడను. నేను మాట్లాడేది అయిపోయింది, ఇక మిగతావాళ్ళు మాట్లాడాలి, చూద్దాం మాట్లాడతారో లేదో” అంటూ నాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
అప్పటి నాని స్పీచ్ తర్వాత ‘రిపబ్లిక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన దండయాత్ర రాజకీయ మలుపులు తీసుకోవడంతో, విషయం మరింత జఠిలమైంది. దీంతో చిరంజీవి వినమ్రంగా విజ్ఞప్తి చేసినా ఫలితం మాత్రం శూన్యం. తాజాగా కూడా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ అదే విజ్ఞప్తిని మెగాస్టార్ వెలిబుచ్చారు.
ఈ వారం రిలీజ్ కాబోతోన్న ‘అఖండ’తో మొదలుపెడితే, వరుసగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ లు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదో మాట వరుసకు బాలకృష్ణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిపి తమ ఇబ్బందులను పరిశీలించాల్సిందిగా కోరారు గానీ, నాని, పవన్ ల మాదిరి ప్రశ్నించలేకపోయారు.
ఈ లైన్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, జగన్ సన్నిహిత హీరో అయిన నాగార్జున, చిరంజీవిలు ఉన్నారు. పెదవి విప్పకుండానే ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వాలని ఈ హీరోలంతా భావిస్తున్నట్లుగా కనపడుతోంది.
సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోలుగా ఎంతటి అద్భుతాలైనా సృష్టించగల వీరంతా రియల్ లైఫ్ లో తమ ఇండస్ట్రీకి వచ్చిన ఆపదలను గట్టెక్కిస్తారో లేదో చూడాలి. విశేషం ఏమిటంటే… డిసెంబర్ లో నాని “శ్యామ్ సింగరాయ్” కూడా ధియేటర్ లలోకి రానుంది.