Producer-Naniహీరోగా కెరీర్ బిల్డ్ చేసుకున్నాక నిర్మాతగా మారి రిస్క్ ఎందుకని చాలా మంది ప్రొడక్షన్ వైపు వెళ్ళరు. అంతెందుకు చిరంజీవే తన నాలుగు దశాబ్దాల కెరీర్ లో తమ్ముడిని ముందుంచి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీయించింది తొమ్మిది సినిమాలే. ఎన్టీఆర్ బ్రతికున్నపుడు నడిచిన రామకృష్ణ స్టూడియోస్ ఆ తర్వాత కార్యకలాపాలు ఆపేసింది. నాగార్జున చాలా కాలం యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పటి జనరేషన్ లో మహేష్ బాబు తను నటించేవాటికే కాకుండా మేజర్ లాంటి కంటెంట్ బేస్డ్ మూవీస్ కి బ్యాకప్ గా నిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ తో కలిసి నితిన్ లాంటి వాళ్ళతో తీశాడు కానీ ఆ తర్వాత నిర్మాణం వైపు చూడటం లేదు.

ఇక్కడి ఉదాహరణాలన్నీ అగ్రహీరోలవి. కొంచెం అటుఇటు అయినా సులభంగా తట్టుకోగల కెపాసిటీ ఉన్నవాళ్ళవి. కానీ న్యాచురల్ స్టార్ నాని అలా కాదు. ఎంత సెటిలైన క్యాటగిరీలో ఉన్నా రిస్క్ అనిపించే పెట్టుబడి వ్యవహారంలో దిగినప్పుడు లాభాల కంటే ఎక్కువగా నష్టాలకే గ్యారెంటీ ఉంటుంది. అయినా సరే రెగ్యులర్ సినిమాల జోలికి వెళ్లకుండా నిర్మాతగానూ తన అభిరుచిని బయటపెట్టుకుంటున్న తీరు నిజంగా ఆకట్టుకునేదే. ఇప్పుడంటే వాల్ పోస్టర్ బ్యానర్ తో హిట్లు గట్రా చూస్తున్నాం కానీ నిజానికి నాని 2013లో డి ఫర్ దోపిడీతోనే ప్రొడ్యూసర్ గా ప్రయాణం మొదలుపెట్టాడు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ డికెల పార్ట్ నర్ షిప్ తో మంచి క్యాస్టింగ్ తో తెరకెక్కించారు

కాన్సెప్ట్ ఎంత బాగున్నా ఆ సినిమా ఆడలేదు. నష్టాలనే తెచ్చింది. ఐదేళ్లు గ్యాప్ తీసుకుని కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి తిపిర్నేనితో కలిసి అ! తో రీ ఎంట్రీ ఇచ్చారు.మాములుగా ప్రశాంత్ వర్మ చెప్పిన కథ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇంకొకరైతే ఇదేం సబ్జెక్టని వద్దని చెబుతారు. కానీ నాని అందులో జాతీయ అవార్డులను తెచ్చే సత్తా గుర్తించాడు. మళ్ళీ సాహసానికి సిద్ధపడ్డాడు. అనుకున్నదే జరిగింది. 66వ నేషనల్ అవార్డుల్లో అ! అన్నంత పనీ చేసింది. కమర్షియల్ గా గొప్ప స్థాయిలో పే చేయకపోయినా నానికి ఆర్థికంగా హార్థికంగా అ! ఇచ్చిన సంతృప్తి చాలా పెద్దది. అదే ఇన్స్ పిరేషన్ గా తీసుకుని 2020లో విశ్వక్ సేన్ హిట్ తో కొత్త క్రైమ్ సిరీస్ ని లాంచ్ చేశాడు

శైలేష్ కొలను చెప్పిన కథకన్నా ట్రీట్మెంట్ లో బలాన్ని గుర్తించిన నాని మరోసారి విజయం సాధించాడు. అక్కడితో ఆగకుండా అతనికే హిట్ 2 బాధ్యతలు అప్పజెప్పి క్షణం గూఢచారి తర్వాత చాలా సెలెక్టివ్ గా మారిపోయిన అడవి శేష్ ని హీరోగా చేసేందుకు మెప్పించేలా చేయగలిగాడు. ఇప్పుడు హిట్ 2 ప్రభంజనం చిన్నగా లేదు. మొదటిరోజే పదకొండు కోట్ల గ్రాస్ అది కూడా కేవలం తెలుగు వెర్షన్ తోనే సాధించడం మరో బెంచ్ మార్క్. ఫార్ములాకు దూరంగా నాని చేస్తున్న ఈ ప్రయోగాలు అతన్నో విలక్షణ నిర్మాతగా నిలబెడుతున్నాయి.