Nandyal By-Election Bypoll - YSRCP - YS Jagan‘కింద పడినా పైచేయి నాదే’ అన్న విధంగా ఉండే జగన్ ముఖకవళికల్లో ప్రస్తుతం నిరుత్సాహం తాండవిస్తోంది. నంద్యాలలో తెలుగుదేశం పార్టీపై విజయం సాధించి, రాబోయే సంవత్సరంన్నర్ర పాటు ఏపీ రాజకీయాలలో ఆధిపత్యం ప్రదర్శించాలని, ఆ తర్వాత 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని భావించిన జగన్ కు ప్రజలు ఇచ్చిన తీర్పు గట్టి షాక్ నే ఇచ్చినట్లుగా కనపడుతోంది. ఫలితాలలో అన్ని రౌండ్లు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగన్… నంద్యాల ప్రజాతీర్పును అంగీకరించకుండా మరోసారి తనదైన ‘మార్క్’ డైలాగ్ ను ప్రదర్శించాడు.

పోలింగ్ కు ముందు వరకు ‘చంపేయండి, ఉరి తీయండి’ అంటూ మాట్లాడిన జగన్, ఫలితాల తర్వాత ‘కొట్టుడు’ అన్న పదాన్ని ఎత్తుకున్నాడు. “అధికారంలో ఉన్నారని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి విజయాన్ని సాధించారని టిడిపిపై ఆరోపణలు చేసిన జగన్, ప్రత్యర్ధి దెబ్బలు కొట్టినపుడు వెనక్కి పోతాం గానీ, కొట్టినాడు కాబట్టి అనుకోవాల్సిన పనిలేదు, ఎన్నికలలో విజయం ఏమిటంటే… అవతలోడు ఎంత గట్టిగా కొడితే, నేనెంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేదే… కొట్టాడు… తీసుకున్నాం… మా టైం వస్తుంది, మేము కొడతాం…” అంటూ మీడియా ముందు దంచి‘కొట్టాడు’ వైసీపీ అధినేత.

తీవ్ర నిరుత్సాహంలో ఉన్నట్లు కనిపించిన జగన్, ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడినట్లుగా కనిపించారు. “నిజానికి ‘ప్రజాతీర్పు’ను అంగీకరిస్తున్నాం” అని ఓ పార్టీ అధినేతగా పరిపక్వతను ప్రదర్శించాల్సిన సమయంలో… మరోసారి తన మార్క్ మేనరిజమ్స్ ను జగన్ ప్రదర్శించినట్లుగా కనపడుతోంది. ఒకప్పుడు సార్వత్రిక ఎన్నికలలో తనతో సహా పార్టీ మొత్తం దారుణ పరాజయం పాలైన సమయంలో ‘ప్రజారాజ్యం’ పార్టీ అధినేత చిరంజీవి ప్రదర్శించిన స్పూర్తే జగన్ లో లోపించిందని చెప్పాలి. రాజకీయాలలో ఉండాలంటే గుండె ధైర్యం కావాలని జగన్ చెప్పిన మాటలు ఎంత వాస్తవమో… ప్రజాభీష్టాన్ని అంగీకరించడానికి కూడా అంతే గుండె ధైర్యం కావాలని తెలియదా… జగన్ గారు..!?