TDP Fans Found Befitting Counter for Director Gunasekhar‘బిగ్ బాస్’ తర్వాత కత్తి మహేష్ ఎంతటి సెలబ్రిటీ అయ్యారో తెలిసిందే. అలాగే నంది అవార్డుల రచ్చ తర్వాత కూడా గుణశేఖర్ కూడా అంతే పాపులర్ అవుతున్నారు. సినీ ప్రేమికులకు గుణశేఖర్ అన్న పేరు తెలియనిది కాదు. ‘సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్’ వంటి సినిమాలతో గుణ అంటే ఏమిటో నిరూపించుకున్న వ్యక్తిగా అందరికీ ఓ గౌరవం ఉంది. మొన్నటివరకు సినీ ప్రేమికులకే తెలిసిన గుణ, ఈ నందుల విమర్శలతో సాధారణ ప్రజలకు కూడా చేరువ అయ్యారని చెప్పొచ్చు.

ఈ పరిణామాలతో ఒక డైరెక్టర్ గా కంటే కూడా, ఒక వివాదాస్పద వ్యక్తిగా ఎక్కువ గుర్తింపును తెచ్చుకోవడంలో గుణశేఖర్ తాపత్రయపడుతున్నట్లుగా కనపడుతోంది. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్నట్లుగా… తాను తీసిన సినిమా తనకు ఎంతో ప్రీతిపాత్రమై ఉండవచ్చు. అంతే కష్టపడి కూడా తీసి ఉండొచ్చు. అయితే అవార్డులు ఇవ్వడానికి ప్రామాణికం ఆ కష్టం కాదు… ఆ కష్టాన్ని సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతంగా చూపిస్తేనే అన్న విషయం గుణశేఖర్ కు తెలియనిది కాదు. మరి ఆ విధంగా పోలిస్తే… ఆ ఏడు వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో ‘రుద్రమదేవి’ని ఏ రకంగానూ పోల్చలేం.

అయినప్పటికీ తన సినిమాకు అవార్డు కావాల్సిందే అంటూ గుణశేఖర్ పడుతున్న మొంకుపట్టు వెనుక ఆంతర్యం ఏమిటో తాజాగా తెలిసి వచ్చింది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్న ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ… తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుణ టార్గెట్ చేయడం విశేషం. దీంతో ఇప్పటివరకు ‘రుద్రమదేవి’ సినిమాకు, అల్లు అర్జున్ కు అవార్డు రాలేదంటూ గుణశేఖర్ చేసిన విమర్శలకు విలువ లేకుండా పోయింది. రాజకీయ ఉద్దేశంతో గుణ ఇన్ని విమర్శలు చేసారన్న అభిప్రాయాన్ని తాజా ట్వీట్ తీసుకువెళ్ళింది.

అంతేగాక “బాలరామాయణం” ద్వారా తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన ఎంఎస్ రెడ్డి పైన చేసిన విమర్శలు తిరిగి ‘బూమ్ రాంగ్’ అవుతున్నాయి. నంది అవార్డుల రచ్చతో గుణశేఖర్ కు రావాల్సిన దాని కంటే ఎక్కువ పేరే వచ్చింది. అయినా దానిని కొనసాగిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లతో హోరేత్తించడం అనేది… ఈ పబ్లిసిటీ ఇంకా గుణశేఖర్ కు సంతృప్తిని ఇవ్వలేదా..? పవన్ ఇన్సిడెంట్ తో కత్తి మహేష్ రూట్ నే గుణ కూడా ఎంచుకున్నట్లుగా కనపడుతోంది.

అయినా ఇంకా ఏం సినిమాలు తీయలేం… నా బెస్ట్ ‘రుద్రమదేవి’ మాత్రమే అన్నట్లుగా… అలా వితండ వాదన చేయడం కన్నా, తదుపరి సినిమాతో అదే ప్రభుత్వ మెడలు వంచి, ఈ సారి ఎలా అవార్డు ఇవ్వరో చూస్తానని ఛాలెంజ్ ప్రవర్తన గుణశేఖర్ లో లోపించడం అనేది ఊహించిన పరిణామం కాదు. ఎందుకంటే… గుణశేఖర్ ఎంతటి ప్రతిభావంతుడో ఆయన దర్శకత్వం వహించిన గత చిత్రాలే చెప్తాయి. “మెగా” రాజకీయ ఉచ్చు నుండి బయటకు వచ్చి, తన ప్రతిభపై శ్రద్ధ పెట్టడం ఈ సమయంలో సరైన నిర్ణయంగా చెప్పవచ్చు.