nandhyala-by-elections-poll-tdp-ysrcpఎంతో ఉత్కంఠను రేపిన నంద్యాల ఉప ఎన్నికలలో ఒక ఘట్టం ముగిసింది. రికార్డు స్థాయిలో ఏకంగా 80 శాతం పైగా పోలింగ్ నమోదు కావడంతో, ఇరు పార్టీల మధ్య పోటీ మరింత రసకందాయంలో పడినట్లయ్యింది. హోరాహోరీ పోరు తప్పదన్న సంకేతాలు స్పష్టం కావడంతో, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి. సహజంగా ఇలాంటి సర్వేలను అందించడంలో ముందుండే పలు మీడియా ఛానల్స్, ఈ సారి మాత్రం వాటికి దూరంగా ఉండడం విశేషం. బహుశా జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేయడంలో విఫలమయ్యారో లేక ఇంకా సమయం తీసుకుంటారో గానీ నంద్యాల ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజానీకానికి నిరాశ ఎదురయ్యింది.

అయితే ఒకే ఒక్క మీడియా ఛానల్ మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను అందించింది. అందులో మాత్రం 46% ఓటింగ్ తో టిడిపి మొదటి స్థానంలో ఉండగా, వైసీపీ 35% ఓటింగ్ తో రెండవ స్థానంలోనూ, కాంగ్రెస్ 11.5% ఓటింగ్ తో మూడవ స్థానంలోనూ, ఇతరులు 7.5% ఓటింగ్ తో చివరి స్థానంలో ఉన్నారని ప్రకటించారు. అయితే ఇదే మీడియా ఛానల్ లో మరో సర్వే వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్తూ… టిడిపికి 49%, వైసీపీకి 42%, కాంగ్రెస్ కు 4%, రాయలసీమ పరిరక్షణ సమితికి 3% వస్తాయని తెలిపారు. రెండు సర్వేలలోనూ అధికార పార్టీ టిడిపికి స్పష్టమైన మెజారిటీ రావడం విశేషం.

ఇక మరో ప్రముఖ లగడపాటి రాజగోపాల్ చెప్పినట్లుగా ఓ కధనాన్ని ప్రచురించింది. నంద్యాల ఎన్నికలలో టిడిపి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని లగడపాటి తమతో చెప్పినట్లుగా సదరు మీడియా చెప్పడంతో, ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యత లభించింది. రాజకీయ సర్వేలలో లగడపాటి రాజగోపాల్ సర్వేలకున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. లగడపాటి చెప్తే అది వందకు వంద శాతం ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఉన్న విషయం తెలిసిందే. తొలి విడత వెలువడిన సమాచారం మేరకు నంద్యాల సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందన్న వార్తలు వెలువడుతున్నాయి