Delhi on Jagan's Side in Nandhyal?
నంద్యాల ఉప ఎన్నికల ఫలితం రావడానికి మరో అయిదు రోజుల సమయం ఉంది గానీ, ఈ ఎన్నికల ఫలితాన్ని తమకు అనుకూలంగా రాబట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటి… నిబంధనలకు విరుద్ధంగా జగన్ మీడియా ఛానల్ సాక్షి చేసిన ప్రసారానికి గాను ఓ కేసు నమోదు కాగా, చంద్రబాబుపై చేసిన దూషణల పర్యవసానానికి గానూ జగన్ పై ఏకంగా నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ధృవీకరించారు.

నంద్యాలలో మొత్తంగా 80 శాతంకు పైగా పోలింగ్ నమోదయ్యిందని చెప్పిన భన్వర్ లాల్, గతంతో పోలిస్తే చాలా మెరుగైన పోలింగ్ అని ఖరారు చేసారు. ఇక, సాక్షిపై కేసు విషయమై స్పందిస్తూ… ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా మంగళవారం నాడు ‘సాక్షి’ ఓ కధనం ప్రసారం చేసిందని, హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసానని, దీంతో ఎన్నికల చట్టం 126 ఏ, బీ కింద పోలీసులు కేసు నమోదైందని స్పష్టం చేసారు. ఇదిలా ఉంటే చంద్ర‌బాబుని కాల్చేయాల‌ని, ఉరితీసినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఈసీ ఆదేశాల మేరకు వైఎస్ జగన్ పై ఐపీసీ 188, 504, 506 సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం 125 ప్రకారం మొత్తం నాలుగు కేసులు నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈసీకి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేయగా… జగన్ నుండి కేంద్రం ఎన్నికల సంఘం వివరణ కోరింది. జగన్ వివరణ ఇచ్చినప్పటికీ, దానితో సంతృప్తి చెందకపోవడంతో, నిబంధనల ఉల్లంఘన క్రిందకే వస్తాయని పేర్కొంటూ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు రావడంతో జగన్ కు మరో నాలుగు కేసులు చుట్టుముట్టాయి.