Nandamuri Taraka Ratna Politicsఒకే రోజు తొమ్మిది చిత్రాలను ప్రారంభించి సంచలనం సృష్టించిన నందమూరి తారకరత్న, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఆశించిన విజయాన్ని అయితే సొంతం చేసుకోలేకపోయాడు. హీరో రేంజ్ నుండి విలన్ కు మారినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. దీంతో తన దృష్టిని రాజకీయాల వైపుకు మరల్చినట్లుగా సినీ పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గత కొంత కాలంగా గుంటూరులో ఉంటున్న తారక్, తెలుగు యువతతో భేటీలు నిర్వహిస్తున్నారని, 2019 ఎన్నికలలో గుంటూరు నుండి బరిలోకి దిగేందుకు బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నాడని పొలిటికల్ వర్గాల టాక్. అన్ని కుదిరితే గుంటూరు నుండి టిడిపి తరపున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని, రాబోతున్న కాలంలో మరింతగా క్రియాశీలంగా పార్టీలో పాలుపంచుకునే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారని హల్చల్ చేస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.

ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని కొన్ని వార్తలు పుట్టుకురాగా, అందులో ఎంత వాస్తవం ఉందో అందరికీ తెలిసిందే. అయితే తారకరత్న విషయంలో పొలిటికల్ ఎంట్రీపై బలాన్నిచ్చే అంశాలు ఏమిటంటే… సినిమాల్లో అవకాశాలు లేకపోవడం మరియు వరుసగా యువతతో భేటీ అవ్వడం. సినిమాలు లేవు గనుక, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం దక్కుతుందేమో గానీ, తొలిసారే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం దక్కుతుందా? అంటే అది వాస్తవానికి బహు దూరమనే చెప్పాలి.