Nandamuri Taraka Ratna Cabara Drive In Restaurantఈ రోజు ఉదయం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నందమూరి తారకరత్న కు చెందిన కబరా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో హీరో తారక రత్న హుటాహుటిన అక్కడికికి చేరుకున్నారు. అయితే తమకు కొంత సమయం ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు.

తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. ఈ మూడు గంటల లోగా రెస్టారెంట్‌లోని సామగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు అంటున్నారు.

వారి ఫిర్యాదుతోనే రెస్టారెంట్‌ను కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. అయితే అధికారులు తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేతకు దిగడం దారుణమని, గత ఎన్నికలలో కూకట్ పల్లిలో నందమూరి సుహాసినికి మద్దతుగా ప్రచారం చేసినందుకు తమ హీరోను అధికారులు వేధిస్తున్నారని నందమూరి అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తారక రత్న దీని మీద న్యాయ పోరాటం చెయ్యడానికి సిద్ధం అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.