Nandamuri Suhasini TDP Campaignరాజకీయాలలో వాక్చాతుర్యం అనేది చాలా అవసరం. వాక్చాతుర్యం ఉన్న నేతలు విషయం లేకపోయినా వెలిగిపోతారు. అది లేని వారు ఎంత గొప్పగా పని చేసినా తిప్పలు తప్పవు. సోషల్ మీడియా ప్రభంజనంలో ఇది బాగా ఎక్కువైంది. సరిగ్గా ఇక్కడే ఇబ్బందే పడుతున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. మంత్రిగా ఎంతో గొప్పగా పని చేసినా టీడీపీ మీద కత్తి గట్టిన కేంద్రంతోనే ఎన్నో అవార్డులు అందుకుంటున్నా ఆయనను అనర్గళంగా మాట్లాడలేకపోవడం వల్ల రాజకీయాలలో తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యర్ధులు.

సరిగ్గా ఎలా అయితే ఆ ఒక్క పాయింట్ మీద లోకేష్ ను ఇరుకున పెడుతున్నారో అదే మంత్రాన్ని హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని మీద ప్రయోగిస్తున్నారు. రాజకీయాలకు కొత్త కావడంతో ఆవిడ మీడియా ముందు మాట్లాడటానికి జంకుతున్నారు. ఈ బెరుకును ఆసరాగా తీసుకుని ఆవిడ రాజకీయాలకు పనికి రాదని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు ఆవిడను ఓడించడానికి ఇదే అస్త్రంగా ఉపయోగిస్తున్నారు.

నిన్న కొందరు కూకట్ పల్లి హద్దులు తెలియక పటాన్ చెరువు లో ప్రచారం చేసిన చుండ్రు సుహాసిని అంటూ ట్విట్టర్ లో వైరల్ చేశారు. నిజానికి అటువంటిది ఏమి జరగలేదు. కాకపోతే ఆవిడను లోకజ్ఞానం లేని దాని లా ముద్ర వెయ్యడం లో భాగం ఇదంతా. తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యని వైకాపా, జనసేన పార్టీ అభిమానులే దీనిని భుజానికి ఎత్తుకున్నారు. తద్వారా ఆవిడను ఎలాగైనా కూకట్ పల్లిలో ఓడించి నందమూరి కుటుంబాన్ని తెలుగు దేశం పార్టీని అభాసుపాలు చెయ్యాలనేది వ్యూహం.

ఆవిడ దీనిని ఎలా ఎదురుకుంటారో చూడాలి. ఎన్టీఆర్ తరువాత తెలంగాణ నుండి పోటీ చేస్తున్న మొదటి నందమూరి కుటుంబసభ్యులు సుహాసిని కావడం విశేషం. ఆవిడ ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మనుగడ ఉండదు అని అందరూ భావించడంతో దీనిని ప్రత్యర్థి పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీకి అన్ని రకాలుగానూ అనుకూలమైన కూకట్ పల్లిలో ఆవిడ గెలుపు సునాయాసమే అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఏం జరగబోతుంది అనేది డిసెంబర్ 11న తేలబోతుంది.