Nandamuri Suhasini TDP Campaign2018 తెలంగాణ ఎన్నికలలో కూకట్ పల్లి నుండి పోటీ చేసి ఓడిపోయిన స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఆ తరువాత కనిపించలేదు. గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న సీటులో పోటీ చేసిన ఆమె వాగ్ధాటి సరిగా లేక వీక్ అభ్యర్థిగా కనపడి ఓడింపబడ్డారు. ఇది ఇలా ఉండగా చాలా కాలం తరువాత ఆమె ఇప్పుడు తెర మీదకు వచ్చారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికను టీడీపీ కిరణ్మయికి మద్దతుగా ఆమె ప్రచారం చెయ్యబోతున్నారు. అక్టోబర్ 16 నుంచి సుహాసిని మూడు రోజుల పాటు కిరణ్మయికి మద్దతుగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అభ్యర్థి మహిళ కావడం, సుహాసిని ప్రచారం.. ఇలా మహిళల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది.

కాగా టీడీపీ అభ్యర్ధికి మద్దతుగా నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారని సమాచారం. అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అక్టోబర్ 24న కౌంటింగ్ జరిపి అదే రోజు ఫలితం ప్రకటిస్తారు. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది.

తన ఉనికిని కాపాడుకోవడానికి టీడీపీ ఇక్కడ నుండి పోటీ చెయ్యాలని నిర్ణయించుకుంది. 2014లో జరిగిన ఎన్నికలలో చివరిసారిగా ఇక్కడ టీడీపీ పోటీ చేసింది. ఆ ఎన్నికలలో నాలుగవ స్థానములో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మూడవ స్థానంలో ఉండటం గమనార్హం. ఇటువంటి క్లిష్టమైన స్థానంలో టీడీపీ సాహసం చేసిందనే చెప్పుకోవాలి.