nandamuri suhasini nominationsదివంగత నేత హరికృష్ణ కుమార్తె సుహాసిని టీడీపీ తరపున కూకట్ పల్లిలో పోటీ చెయ్యబోతున్నారు. కాసేపటి క్రితం ఆవిడ నామినేషన్ వేశారు. అయితే పార్టీ ఆవిడని నందమూరి సుహాసినిగా పిలవడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు, సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతుంది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు చుండ్రు శ్రీకాంత్ ను వివాహం చేసుకున్నాకా కూడా ఆవిడ నందమూరి సుహాసిని గానే ఉందా? ఇది ఓట్ల రాజకీయం కాదా అని సోషల్ మీడియాలో విపక్షాల విసుర్లు.

అయితే దీనిని తెలుగు దేశం అభిమానులు సమర్థవంతంగానే తిప్పి కొట్టారు. వివాహం అయ్యాకా కూడా కవిత… కల్వకుంట్ల కవితగానే ఎలా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఖైదీ నెంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసి ఆ చిత్రం పేర్లలో కొణిదెల సుష్మిత అనే వేయించుకోవడం చూపించి జనసేన అభిమానులకు పంచ్ వేశారు. మంచు లక్ష్మి మొదలయిన వారి ఉదాహరణలు కూడా వారు చూబిస్తున్నారు. ఈ విషయంలో మిగతా పార్టీల విమర్శలను తెలుగు తమ్ముళ్ళు బాగానే తిప్పికొట్టారు అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ తరువాత తెలంగాణ నుండి పోటీ చేస్తున్న మొదటి నందమూరి కుటుంబసభ్యులు సుహాసిని కావడం విశేషం. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఒకరు పోటీచేస్తే తెదేపాకే కాకుండా మహాకూటమికి సైతం ఊపు వస్తుందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణాలో తెలుగు దేశం మనుగడకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్నికలలో మహాకూటమి అధికారంలోకి వస్తేనే టీడీపీ మనుగడ సాగించే పరిస్థితి ఉంటుంది.