Nandamuri-Ramakrishna_Taraka_Ratna_Health_Conditionగత మూడు రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్‌ మనుమడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటువంటి విషాదకర పరిణామాణానికి కూడా కొందరు నేతలు, మీడియాలో ఓ వర్గం రాజకీయ బురద అంటించాలని ప్రయత్నిస్తుండటం చాలా బాధాకరమే.

నందమూరి రామకృష్ణ సోమవారం హాస్పిటల్‌లో వైద్యులతో మాట్లాడి, తారకరత్నని స్వయంగా చూసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవం కావు. తారకరత్న ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు చెప్పారు. తారకరత్నవెంటిలేటర్ మీద ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకి సీటీ స్కానింగ్ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఏవిదంగా ఉందనేది పూర్తిగా తెలుస్తుంది.

తారకరత్నని ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు కృత్రిమంగా ఆక్సిజన్ అందించిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు అతనే కొంతవరకు శ్వాస తీసుకొంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇక శరీరావయావలకి రక్త ప్రసరణ మెరుగు పడటానికి మరికొంత సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా పూర్తిగా కొలుకొంటాడని ఆశిస్తున్నాను. ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు.

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 27వ తేదీన కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు, నారా లోకేష్‌కి సంఘీభావం తెలిపేందుకు తారకరత్న కూడా కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నప్పుడు హటాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. మొదట కుప్పంలో వైద్యం అందించిన తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయకి తరలించి చికిత్స అందిస్తున్నారు.